మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:07 PM
మహిళా సాధికారత దిశగా కేంద్రం మరో కీలక ముందడుగేసింది. ఈ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు మద్దతివ్వాలని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
ఇంటర్నెట్ డెస్క్: మహిళా సాధికారత దిశగా కేంద్రం మరో కీలక ముందడుగేసింది. ఈ మేరకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వాలని ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ సభ్యులంతా తమ మనస్సాక్షికి అనుగుణంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని మహిళా శక్తిని గౌరవించడానికి ఇదో గొప్ప అవకాశమని ఆయన కొనియాడారు. మహిళలకు తగిన హక్కులను కల్పించడంలో అందరం సమష్టిగా చరిత్ర సృష్టించాలన్నారు. ఏకాభిప్రాయంతో ఈ సవరణను ఆమోదించాలని, దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఎక్స్ వేదికగా ప్రధాని కోరారు.
'నేను ఎంపీలందరినీ కోరేది ఒక్కటే.. మీ ఇంట్లోని తల్లిని, సోదరిని, కుమార్తెను, భార్యను గుర్తుంచుకుని.. మీ మనస్సాక్షి చెప్పిందే వినండి. దేశ మహిళలకు సాధికారత కల్పించడం అనేది ఒక గొప్ప అవకాశం. వారికి కొత్త అవకాశాలను దూరం చేయకండి. ఈ సవరణ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందితే.. దేశంలో మహిళా శక్తి మరింత బలోపేతమవుతుంది. ఫలితంగా.. దేశ ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. రండి.. ఈ రోజు మనమందరం కలిసి చరిత్ర సృష్టిద్దాం' అని మోదీ పిలుపునిచ్చారు.
మహిళలకు వారి హక్కులు ఇచ్చేందుకు సమయం ఆసన్నమైందని అంతకముందు జరిగిన చర్చ సందర్భంగా మోదీ ప్రసంగించారు. నారీ శక్తి వందన్ అధినియమ్‌కు చేసిన సవరణలపై పార్లమెంటులో సవివరమైన, సుదీర్ఘ రీతిలో చర్చ జరుగుతోందన్నారు. ఇప్పటివరకు జరిగిన చర్చలో సదరు బిల్లుపై ఉన్న అపోహలను తొలగించామని, సభ్యుల సందేహాలన్నింటినీ నివృతి చేశామని ఆయన తెలిపారు. ఇది చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య అని, దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్‌ను రాజకీయం చేశారని, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. మరికాసేపట్లో ఈ బిల్లు లోక్‌సభలో ఓటింగ్‌కు రానున్న నేపథ్యంలో ఎంపీలంతా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు మోదీ. సభ్యులు సున్నితంగా వ్యవహరించాలని, 'నారీ శక్తి' మనోభావాలను దెబ్బతీయవద్దని కోరారు.
ఇవీ చదవండి:
పంజాబ్ మంత్రి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు..
హీరో దర్శన్ మేనేజర్ మల్లికార్జున్ ప్రత్యక్షం