మహిళా రిజర్వేషన్‌పై నోటిఫికేషన్.. లోక్‌సభలో చర్చ జరుగుతుండగానే..
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:26 PM
మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చినట్టు కేంద్ర న్యాయశాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 16 నుంచి చట్టం అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే గురువారం కేంద్ర న్యాయశాఖ మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, ఏప్రిల్ 16ను చట్టం అమలు తేదీగా ఎంపిక చేయడానికి కారణాలేమిటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. చట్టం అమల్లోకి వచ్చినా ప్రస్తుత సభలో మహిళలకు సీట్ల కేటాయింపు సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జనగణన డేటా ఆధారంగా డీలిమిటేషన్ తరువాతే సీట్ల కేటాయింపు అమలవుతుందని తెలిపాయి.
చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ కోసం 2023 సెప్టెంబర్‌లో నారీ శక్తి వందన్ అధినియమ్ పేరిట చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లను కేటాయిస్తూ పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించింది. అప్పటి చట్టం ప్రకారం, రిజర్వేషన్ అమలు కోసం, 2027 తరువాతి జనగణన డేటా అవసరం పడటంతో 2034 నాటికి గానీ ఈ రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం లేదు. అయితే, 2029 నాటికల్లా రిజర్వేషన్ అమలు చేసేలా కేంద్రం తాజాగా లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది.