Share News

పంజాబ్ మంత్రి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు..

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:52 PM

పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహించారు. మంత్రి కుమారుడు, సహచరులు, వ్యాపార భాగస్వాములు సహా మెుత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు.

పంజాబ్ మంత్రి ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు..
Minister Sanjeev Arora

చండీగఢ్: పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా ఇళ్లు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు నిర్వహించింది. మంత్రి కుమారుడు, సహచరులు, వ్యాపార భాగస్వాములు సహా మెుత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసుల్లో భాగంగా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనల కింద గురుగ్రామ్, చండీగఢ్, లుధియానా, జలంధర్‌లలో ఈ సోదాలు చేశారు. సంజీవ్ అరోరా, అతని కుమారుడు కావ్య అరోరా, అలాగే వ్యాపార భాగస్వాములైన హేమంత్ సూద్, చంద్రశేఖర్ అగర్వాల్‌ నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేశారు.


పంజాబ్‌లో భారీ స్థాయి రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడుతోంది హాంప్టన్ స్కై రియల్టీ లిమిటెడ్. దీనికి అరోరా ప్రమోటర్ ఉండగా.. అతని కుమారుడు ప్రస్తుతం ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భూముల వినియోగంలో చట్టవిరుద్ధమైన మార్పులు, షేర్ ధరలను తారుమారు చేయడం, అమ్మకాలను పెంచి చూడడం, ఇన్ సైడర్ ట్రేడింగ్, యూఏఈ నుంచి నిధుల రౌండ్ ట్రిప్పింగ్ వంటి ఆరోపణలు ఈ సంస్థపై ఉన్నాయి. వీరు చట్టవిరుద్ధంగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించి వచ్చిన ఆదాయాన్ని, అలాగే లెక్కల్లో చూపని నగదును విదేశాలకు పంపారని అనుమానిస్తున్నారు. ఆ తర్వాత నగదును భారతదేశానికి మళ్లించి రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


అయితే, ఈడీ దాడులపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకుని కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆయన ఆరోపించారు. కేవలం 10 ఏళ్లలో ఆమ్ ఆద్మీ పార్టీ వేగంగా ఎదిగిందని, ఇది బీజేపీని కలవరపెడుతోందన్నారు. అందుకే ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని భగవంత్ మాన్ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: ఎంపీ శశిథరూర్

మహిళా రిజర్వేషన్‌పై నోటిఫికేషన్.. లోక్‌సభలో చర్చ జరుగుతుండగానే..

Updated Date - Apr 17 , 2026 | 01:05 PM