సీజర్ మెమో ఇవ్వకుండానే ఫోన్లు లాక్కున్నారు: సీజేపీ
ABN , Publish Date - Oct 11 , 2026 | 08:04 PM
పోలీసులు తమకు సీజర్ మెమో ఇవ్వకుండానే తమ ఫోన్లను లాక్కున్నారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కోకన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు. తమ ఫోన్లను హ్యాక్ చేసి లేదా క్లోన్ చేసి ఉండవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమకు అధికారిక నోటీసు ఇవ్వకుండానే నిర్బంధించారని ఆయన చెప్పారు.
ఇంటర్‌నెట్ డెస్క్: పోలీసులు తమకు సీజర్ మెమో ఇవ్వకుండానే తమ ఫోన్లను లాక్కున్నారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కోకన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు. తమ ఫోన్లను హ్యాక్ చేసి లేదా క్లోన్ చేసి ఉండవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే తమకు అధికారిక నోటీసు ఇవ్వకుండానే నిర్బంధించారని ఆయన చెప్పారు. ఆదివారం పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన తర్వాత ఢిల్లీలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మీడియాతో దాస్ మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారికి జరిగినట్లుగానే సీజేపీ నేతలకూ జరిగిందన్నారు. ‘‘కేంద్రంపై గళమెత్తిన వారికి ఏం జరిగిందో గతంలో మనం చూశాం. ఇప్పుడు కూడా మాకూ అలాగే జరుగుతోందని భయపడుతున్నాం. ఎలాంటి సీజర్ నోటీసు ఇవ్వకుండానే పోలీసులు మా ఫోన్లను లాక్కున్నారు. ఇప్పుడు వాటిని హ్యాక్ చేసి ఉండవచ్చు. లేదా క్లోనింగ్ చేసి ఉండవచ్చు. మా ఫోన్లను ఉన్న సమాచారాన్ని సేకరించి దానిని సాక్ష్యాధారాలుగా చూపే ప్రయత్నం జరగవచ్చు. మమ్మల్ని నిర్బంధించే ముందు కనీసం లీగల్ నోటీసు కూడా ఇవ్వలేదు. అలాగే లాయర్లను సంప్రదించే టైం కూడా ఇవ్వలేదు’’ అని దాస్ వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి సృష్టించిందని ఆయన ఆరోపించారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, వ్యవస్థలన్నింటినీ ప్రజలకు వ్యతిరేకంగా వాడుకుంటోందని విమర్శించారు. వాస్తవానికి నిరసనకారులను అడ్డుకోవడం బదులుగా చర్చలకు తమను ఆహ్వానించి ఉంటే బాగుండేదన్నారు. మరో సీజేపీ నేత అశుతోష్ రంకా మాట్లాడుతూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమకు వ్యతిరేకంగా మార్చుకున్నారని ఆరోపించారు. గత 72 గంటల్లో దేశంలో జరిగిన పరిణామాలు ప్రజలకు ఎమర్జెన్సీని గుర్తుకు తెచ్చాయన్నారు. ‘‘1975లో కూడా రైళ్లను బంద్ చేయలేదు. కానీ, మోదీ సర్కారు రైళ్లను మూయించి ఆందోళనకారులు ఢిల్లీకి రాకుండా అడ్డుకుంది’’ అని రంకా పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చవండి:
రియాద్ విమానాశ్రయంపై దాడి.. సౌదీకి సాయం గురించి అమెరికా ఆలోచన..
రియాద్ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. ఖండించిన భారత్