రాహుల్.. మీ ఓటములకు కారణం వెతుక్కో.. అమిత్ షా సూచన
ABN , Publish Date - Oct 13 , 2026 | 08:16 PM
ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు సంధించారు. దేశ ప్రజలు ఇంకా ప్రధాని నరేంద్ర మోదీతోనే ఉన్నారని ఆయన అన్నారు. గుజరాత్‌లో స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మాట్లాడారు.
ఇంటర్‌నెట్ డెస్క్: ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు సంధించారు. దేశ ప్రజలు ఇంకా ప్రధాని నరేంద్ర మోదీతోనే ఉన్నారని ఆయన అన్నారు. గుజరాత్‌లో స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమి నేతలు 2029 ఎన్నికల్లోనూ ఓడిపోతున్నారని, ఇందుకు వారు సిద్ధంగా ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రాహుల్‌గాంధీ ప్రభావమే లేదన్నారు. అలాగే, ఈసీపై ఆరోపణల అంశంలో కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలి సూచించారు. రాష్ట్రాలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వరుస ఓటములు తప్పట్లేదని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓడిపోవడంవల్లే కాంగ్రెస్ ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు అంటోదని, అవే ఈవీఎంలతో జరిగిన ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది కదా అని అమిత్ షా ప్రశ్నించారు.
రాహుల్‌ది ఝాఠ్ కీ గూంజ్
ప్రజలు, మీడియా దృష్టిని ఆకర్షించేందుకే కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని అమిత్ షా దుయ్యబట్టారు. దేశ ప్రజలందరూ మోదీ, బీజేపీ, ఎన్డీఏ వైపు ఉన్నారని ఆయన చెప్పారు. రాహుల్ చేసేది ఛాత్రోం కీ గూంజ్ కాదని, ఝూఠ్ కీ గూంజ్ అని విమర్శించారు. ‘ఇండి కూటమి కుట్ర రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. సర్ రాకముందు అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. భారత్‌లోకి అక్రమంగా చొరబడేవారికి ఇండి కూటమి కొమ్ముకాస్తోంది. స్వార్థ రాజకీయాలు తప్ప కాంగ్రెస్ నేతలకు దేశ భద్రత పట్టదు’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత చెరిగిపోలేనిది
దేశ ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయత చెరిగిపోలేనిదని అమిత్ షా అన్నారు. ‘గుజరాత్‌లోని మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు మూడు మునిసిపాలిటీలకు ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. మొత్తం 104 సీట్లలో 90 చోట్ల బీజేపీ గెలిచింది. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న గాంధీ నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో 44 సీట్లకు 38 సీట్లలో మేము విజయం సాధించాం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి’ అని షా పేర్కొన్నారు. గుజరాత్‌లోని స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం గుజరాత్ ఓటర్ల మూడ్‌ను ప్రతిఫలిస్తోందన్నారు. గుజరాత్ ప్రజలు ఇంకా ప్రధాని మోదీ వెంటే ఉన్నారని చెప్పడానికి తాజా ఫలితాలే నిదర్శనమన్నారు.
బీజేపీ ఓట్ షేర్ కూడా పైకి
గత ఎన్నికలతో పోలిస్తే, గాంధీ నగర్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఈసారి బీజేపీ ఓట్ షేర్ కూడా 10 శాతం పెరిగిందని అమిత్ షా అన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి తాను ఒక విషయం చెప్పదలచుకున్నానని తెలిపారు. ‘రాహుల్ జీ.. గత 41 ఏళ్లలో గుజరాత్‌లో కాంగ్రెస్ ఒక్క ఎన్నికలోనూ విజయం సాధించలేదు. చివరిసారిగా కాంగ్రెస్ 1985లో గెలిచింది. అప్పటి నుంచి ఓడిపోతూనే ఉంది. అలాగే రాహుల్ లోక్‌సభ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కాంగ్రెస్ ఓడిపోతూనే ఉంది. సర్ ప్రక్రియ 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రారంభమైంది. అంతకుముందు కూడా కాంగ్రెస్ ఓడిపోయింది. ఇప్పుడు గుజరాత్‌లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కూడా సర్ కారణమా? బ్యాలట్ పేపర్లు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఓడిపోయింది’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వరుస ఓటములకు రాహుల్ గాంధీ కారణాలు వెతుక్కోవాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి