యార్ ఏంటి?.. విపక్ష ఎంపీలపై ప్యానెల్ స్పీకర్ ఆగ్రహం
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:44 PM
మంగళవారం నాడు లోక్‌సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో ఎన్డీయే కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇవాళ (మంగళవారం) లోక్‌సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రసంగిస్తున్న సమయంలో ఎన్డీయే కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విపక్ష ఎంపీ ఒకరు ప్యానెల్ స్పీకర్‌ను ఉద్దేశించి ‘యార్(yaar)’ అని సంబోధించారు. ఇలా మాట్లాడటంపై ప్యానెల్ స్పీకర్ టి.కృష్ణప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
విపక్ష సభ్యులు చేసిన యార్ అనే కామెంట్ పై స్పందిస్తూ...'ఇప్పుడు మీరు ఏం అన్నారు? ఈ యార్ ఏంటి? ఇది పార్లమెంట్. మీరు సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఇది సభా మర్యాదను అవమానించినట్లే. వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోండి’ అని ప్యానెల్ స్పీకర్‌గా ఉన్న టి.కృష్ణ ప్రసాద్ మందలించారు. టీడీపీ ఎంపీ అయిన ఆయన లోక్‌సభలో ప్యానెల్ ఆఫ్ ఛైర్‌పర్సన్స్‌లో ఒకరు.
అసలు ఏం జరిగిందంటే...
చైనా దురాక్రమణపై భారత సైన్యం మాజీ అధిపతి ఎం.ఎం.నరవణె రాసిన ఆత్మకథలోని అంశాలను మంగళవారం నాడు పార్లమెంట్ సమావేశంలో విపక్షనేత రాహుల్‌గాంధీ ప్రస్తావించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా జాతీయ భద్రతా అంశాలపై మాట్లాడాలనుకుంటున్నానని రాహుల్ తెలిపారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీల సభ్యులు స్పీకర్ కుర్చీ వైపు పేపర్లు చించి విసిరారు. ఈ సెషన్ మొత్తానికి ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ చర్యలు తీసుకున్నారు. వారి సస్పెన్షన్ కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. విపక్ష సభ్యులు సభను, స్పీకర్ అధికారాన్ని పూర్తిగా విస్మరించి వ్యవహరించారని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఎంపీలు మాణిక్కం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, అమరీందర్ సింగ్ రాజా, కిరణ్ కుమార్ రెడ్డి, హిబీ ఈడెన్, డీన్ కురియకోస్, ప్రశాంత్ పడోలేతోపాటు సీపీఎమ్‌కు చెందిన ఎస్.వెంకటేశన్ ను లోక్‌సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం సభ రేపటి(బుధవారం)కి వాయిదా పడింది.
ఇవీ చదవండి:
హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం.. మంత్రికి తప్పిన ప్రమాదం
అజిత్ పవార్ అంత్యక్రియల్లో రెచ్చిపోయిన దొంగలు.. ఏడుగురి అరెస్ట్