Share News

చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని భారత్ మాతో చెప్పలేదు.. రష్యా స్పందన

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:24 PM

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందించారు. ఈ విషయంలో న్యూఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదని చెప్పారు.

చమురు కొనుగోళ్లు నిలిపివేస్తామని భారత్ మాతో చెప్పలేదు.. రష్యా స్పందన
PM Modi with Putin

న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై క్రెమ్లిన్ స్పందించింది. న్యూఢిల్లీ నుంచి ఇంతవరకూ అలాంటి సంకేతాలేవీ తమకు రాలేదని పేర్కొంది.


వాషింగ్టన్-న్యూఢిల్లీ మధ్య ట్రేడ్ ఒప్పందం కుదిరిందంటూ ట్రంప్ తన 'ట్రూత్‌'లో పోస్ట్ చేశారు. రష్యన్ చమురు కొనుగోళ్లను ఆపడానికి, అమెరికా, వెనెజువెలా నుంచి కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించినట్టు ట్రంప్ ప్రకటించారు. దీనిపై మోదీ వెంటనే స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18 శాతమే అమెరికా సుంకాలు అమలవుతాయని, ఇది సంతోషకరమని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేసే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.


ఇండియాతో విలువైన సంబంధాలు: రష్యా

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందంటూ ట్రంప్ చేసిన ప్రకటనపై క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడారు. ఈ విషయంలో న్యూఢిల్లీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని చెప్పారు. భారత్‌తో తమకు విలువైన సంబంధాలు ఉన్నాయని, ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగ్యస్వామ్యం కొనసాగుతుందని చెప్పారు. 'అమెరికా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మేము గౌరవిస్తున్నాం. అయితే రష్యా-ఇండియా మధ్య కీలక రంగాల్లో అత్యంత లోతైన, విస్తృతమైన సహకారం కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఇది మాకు అత్యంత ముఖ్యం కూడా. ఢిల్లీతో మా దైపాక్షిక సంబంధాలను మరింత విస్తృత పరుచుకోవాలన్నదే మా అభిమతం' అని చెప్పారు. ఉక్రెయిన్‌ యుద్ధ 2022లో ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి డిస్కౌంట్‌తో ముడిచమురును కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ కీలకంగా ఉంది. ఇది పశ్చిమ దేశాలకు కన్నెర్ర అవుతోంది.


ఇవి కూడా చదవండి..

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ

ట్రంప్ ఒత్తిడితోనే మోదీ ట్రేడ్ డీల్.. విమర్శలు గుప్పించిన రాహుల్

Updated Date - Feb 03 , 2026 | 05:46 PM