అజిత్ పవార్ అంత్యక్రియల్లో రెచ్చిపోయిన దొంగలు.. ఏడుగురి అరెస్ట్
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:02 PM
గత నెల 29న బారామతిలో విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో చేతివాటం చూపించిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
పూణె, ఫిబ్రవరి 03: జనవరి 28న విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. అయితే, జనవరి 29(గురువారం)న బారామతిలో విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు జరగ్గా కొందరు రెచ్చిపోయారు. ఈ కార్యక్రమంలో (Ajit Pawar Funeral) కొంతమంది దొంగలు తమ చేతివాటం చూపించారు. అంత్యక్రియలకు హాజరైన వారిలో దాదాపు 15మంది వ్యక్తులకు చెందిన రూ.30లక్షల విలువ చేసే బంగారు వస్తువులను కొట్టేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశారు.
నిందితులను రాజ్‌కుమార్ బాబురావు అథవాలే, మహ్మద్ అనీస్, ఎజాజ్ భగు మిరావాలే, మహ్మద్ సాదిక్, బాలు అలియాస్ దత్తాత్రయ బాబాన్ ధోత్రే, తుషార్ కైలాస్ మసాల్, నితిన్ అంకుష్ గైక్వాడ్‌లుగా గుర్తించారు. పలువురి బంగారు గొలుసులు, నగదు చోరీకి గురైనట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.
సాంకేతిక, రహస్య సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించి, నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ సందీప్ గిల్, ఏఎస్పీ గణేష్ బిరాదార్, సబ్-డివిజనల్ పోలీసు అధికారి సుదర్శన్ రాథోడ్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగింది. నిందితుల నుంచి దొంగిలించబడిన వస్తువులను బాధితులకు అప్పగించేందుకు సమగ్ర విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు
ఇవి కూడా చదవండి..
అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ
అమెరికాతో ట్రేడ్ డీల్‌పై సుమోటో ప్రకటనకు కేంద్రం హామీ