ఆపరేషన్ సిందూర్‌తో సత్తా చాటాం: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
ABN , Publish Date - Oct 25 , 2026 | 01:54 PM
ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నిర్వహించిన దాడులు తమ సత్తాను చాటాయని భారత వైమానిక దళాధిపతి (ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. శత్రువులు ఐఏఎఫ్ నుంచి తప్పించుకోలేరని ఆ ఆపరేషన్ నిరూపించిందని పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ ఆయన పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఆపరేషన్ సిందూర్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) నిర్వహించిన దాడులు తమ సత్తాను చాటాయని భారత వైమానిక దళాధిపతి (ఐఏఎఫ్) ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. శత్రువులు ఐఏఎఫ్ నుంచి తప్పించుకోలేరని ఆ ఆపరేషన్ నిరూపించిందని పాకిస్థాన్‌ను హెచ్చరిస్తూ ఆయన పేర్కొన్నారు. ఆదివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా సుమారు 1,200 కిలోమీటర్ల వెడల్పు, 200 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలపై దాడులు నిర్వహించామని వెల్లడించారు. ఆ విజయాన్ని చూసి ప్రస్తుత సామర్థ్యాలతోనే ఆగిపోరాదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత పటిష్టంగా వైమానిక దళ సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యర్థి వ్యూహాలు మారుతున్న కొద్దీ వేగంగా స్పందించేందుకు, వివిధ ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచుకోవడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఒకే ఆయుధం లేదా వ్యవస్థపై ఆధారపడకుండా అనేక రకాల సామర్థ్యాలను వినియోగించగలిగే దళం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలదని చెప్పారు. ఇదే విధానం ద్వారా ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నియంత్రించగలిగామని తెలిపారు. నిరుడు మేలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలతో పాటు పాక్ ఆక్రమిత ప్రాంతాల్లోని లక్ష్యాలపై కచ్చితమైన దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సిందూర్‌తో తాము ఎంచుకున్న వ్యూహం సరైనదేనని నిరూపించామని ఏపీ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే దిశగా ముందుకు సాగుతామని, దేశం మరోసారి బాధ్యత అప్పగిస్తే మరింత వేగంగా, కచ్చితత్వంతో వైమానిక దళాన్ని సిద్ధం చేస్తామని తెలిపారు.
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కొన్ని ఆయుధ వ్యవస్థలు ఆ ఆపరేషన్‌లో అసాధారణ పనితీరు కనబరిచాయని ఆయన వెల్లడించారు. శత్రు భూభాగంలో లోతుగా ఉన్న లక్ష్యాలపై తీవ్ర ప్రభావం చూపేలా దాడులు నిర్వహించామని చెప్పారు. ఆపరేషన్ మొత్తం సమయంలో పౌర ఆస్తులకు, ప్రాణాలకు నష్టం కలగకుండా చూశామన్నారు. ఆ ఆపరేషన్ విజయానికి ఏ ఒక్క ఆయుధం లేదా యుద్ధ విమానం మాత్రమే కారణం కాదని వైమానిక దళాధిపతి వివరించారు. కచ్చితమైన నిఘా సమాచారం, నెట్‌వర్క్ ఆధారిత ఆపరేషన్లు, శత్రు పరిధికి వెలుపలి నుంచే ప్రయోగించగల ఆయుధాలు, కచ్చితత్వంతో కూడిన అటాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వంటి వాటితో ఆశించిన ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్ ధర 2 లక్షలు