ఐడీబీఐ ప్రైవేటీకరణపై రాహుల్ విమర్శలకు ఆర్థికమంత్రి నిర్మలా స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Oct 30 , 2026 | 02:36 PM
ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై రాహుల్ గాంధీ విమర్శలకు నిర్మలా సీతారామన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకులను సొంత జాగీరులా వాడుకుందంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వ బ్యాంకులు నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నె్ట్ డెస్క్: ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణపై కేంద్రం, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఉద్యోగులతో పాటు, దేశం నష్టపోతుందన్న రాహుల్ విమర్శలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. కాంగ్రెస్ హయాంలోనే ప్రభుత్వరంగ బ్యాంకులు నిర్వీర్యమయ్యాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల అండతోనే కింగ్‌ఫిషర్, వీడియోకాన్, ఏబీజీ షిప్‌యార్డ్‌లకు వేల కోట్ల రుణాలు మంజూరయ్యాయని ఆమె తీవ్రంగా విమర్శించారు.
నాడు పలుకుబడి ఉన్నవారికి ‘ఫోన్‌బుక్’.. సామాన్యులకు ‘రూల్‌బుక్’ ఉండేవని ఆర్థికమంత్రి ఎద్దేవా చేశారు. 1957 ముంద్రా స్కామ్ నుంచి యూపీఏ హయాం వరకు బ్యాంకుల్లో రాజకీయ జోక్యాన్ని ఆమె ప్రస్తావించారు. సంజయ్ గాంధీ సన్నిహితులకు రుణాలు ఇవ్వనందుకే 1976లో నాటి ఎస్‌బీఐ చైర్మన్ ఆర్.కె. తల్వార్‌ను తొలగించారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో ఇచ్చిన రుణాల వల్లే ఐడీబీఐ బ్యాంక్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని.. రూ.25 వేల కోట్ల మూలధనంతో ఎన్డీయే ప్రభుత్వమే ఐడీబీఐని గాడిలో పెట్టిందని పేర్కొన్నారు. ఐడీబీఐ వాటా విక్రయంలో పూర్తి పారదర్శకత పాటించామని.. రెండో విడత బిడ్డింగ్‌లో ఐడీబీఐ విలువ రూ.3,917 కోట్లు పెరిగిందని నిర్మాలా సీతారామన్ వెల్లడించారు. రాఫెల్ వ్యవహారంలాగే ఐడీబీఐ విషయంలోనూ రాహుల్ ఆరోపణలు తేలిపోతాయని ఎద్దేవా చేశారు. రూ.52,878 కోట్లకు ఐడీబీఐలో 60.72% వాటాను ఫెయిర్‌ఫాక్స్ సంస్థకు విక్రయించేందుకు ఇటీవల కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని.. ఈ ఒప్పందంలో భాగంగా కేంద్రం 30.48 శాతం, ఎల్‌ఐసీ 30.24 శాతం వాటాను విక్రయించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
కులం, మతం, డబ్బుతో దేశాన్ని విభజించాలని చూస్తున్నారు: వెంకయ్య నాయుడు..