Share News

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ ఉన్నతాధికారి గోపిశెట్టి ఆచూకీ గల్లంతు

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:05 AM

నేపాల్‌లో బీభత్సం సృష్టించిన ఆకస్మిక వరదల్లో ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈఓ లక్ష్మీనాథ్ గోపిశెట్టి ఆచూకీ గల్లంతైంది. ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్‌‌కు వెళ్లినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ ఉన్నతాధికారి గోపిశెట్టి ఆచూకీ గల్లంతు

ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో బీభత్సం సృష్టించిన ఆకస్మిక వరదల్లో ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ సీఈఓ లక్ష్మీనాథ్ గోపిశెట్టి ఆచూకీ గల్లంతైంది. ఆయన వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్‌‌కు వెళ్లినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఆయనతో సంబంధాలు తెగిపోయాయని, ఆచూకీ కోసం సంబంధిత అధికారులతో కలిసి గాలిస్తున్నామని తెలిపింది. గోపిశెట్టి కుటుంబ సభ్యులతో సంస్థ సంప్రదింపులు జరుపుతూ, వారికి అవసరమైన సాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది.


కాగా.. నేపాల్‌-చైనా సరిహద్దు ప్రాంతంలో ఈ నెల 26న సంభవించిన జల ప్రళయంలో పలు రహదారులు, వంతెనలు, భవనాలు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా నేపాల్‌లోని రసువా జిల్లా, చైనాలోని టిబెట్‌ ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. సహాయక చర్యలకు ప్రతికూల వాతావరణం, దెబ్బతిన్న రవాణా, సమాచార వ్యవస్థలు సవాలుగా మారాయి. ఈ విపత్తు కారణంగా వందలాది మంది భారతీయుల ఆచూకీ గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ(MEA) తెలిపింది. సుమారు 320 మంది భారతీయులు ఇంకా అందుబాటులోకి రాలేదని వెల్లడించింది. అటు చైనాలో సుమారు 400 మంది భారతీయులు చిక్కుకున్నప్పటికీ సురక్షితంగా ఉన్నారంది. ఆయా కుటుంబ సభ్యులు వారితో కాంటాక్ట్‌లో ఉన్నారని తెలిపింది. చైనా వైపు చిక్కుకున్న వారిలో కొంతమంది ఇప్పటికే నేపాల్‌కు చేరుకున్నారు. తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులు కూడా సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగా, గల్లంతైన భారతీయుల ఆచూకీ కోసం భారత దౌత్య అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


గోపిశెట్టి ఇన్ఫోసిస్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌కు నాయకత్వం వహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యూహరచన, సాంకేతికత, కార్యకలాపాలు, డిజిటల్‌ పరివర్తనలో సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఇన్ఫోసిస్‌లో గ్లోబల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా, యాక్సెంచర్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.


ఇవీ చదవండి:

భారత్‌కూ అదే ముప్పు

చావుకి బతుక్కి మధ్య..!

Updated Date - Aug 29 , 2026 | 11:13 AM