నీట్ నిరసనకారులకు ఊరట.. కేసులు ఉపసంహరించుకున్న అస్సాం, బిహార్
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:59 AM
నీట్ యూజీ పరీక్షల వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ఊరట లభించింది.
ఇంటర్నెట్ డెస్క్: నీట్ యూజీ (NEET-UG) పరీక్షల వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ఊరట లభించింది. నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని అస్సాం, బిహార్ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం కూడా త్వరలోనే ఇదే బాటలో నడవనుందని సమాచారం.
ఈ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ప్రతినిధులతో చర్చించిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇచ్చారు. అస్సాం, బిహార్ తరహాలోనే రాజస్థాన్‌లోనూ విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని తెలిపినట్లు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ వెల్లడించారు. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థలో సంస్కరణలను దృష్టిలో ఉంచుకుని అస్సాం హోం శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
జులై 26 సాయంత్రం 6 గంటల వరకు నమోదైన 5 కేసుల్లో అరెస్టైన 13 మందిని త్వరితగతిన సమీక్షించి విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా నిరసనల్లో పాల్గొన్న అభ్యర్థులు లేదా విద్యార్థులపై భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండబోవని అస్సాం హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్‌మెంట్ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రభుత్వాల ఈ నిర్ణయంతో వేలాది మంది విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన షర్మిల.. పారా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
మరో కొత్త టోర్నీని ప్రారంభించిన పాకిస్థాన్.. పూర్తి వివరాలు ఇవే