విద్యార్థులను చంపిందే కాంగ్రెస్..!
ABN , Publish Date - Jul 28 , 2026 | 08:36 AM
తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను కాల్చిన చంపిన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పట్ల కర్కశ వైఖరి అవలంభించిన చరిత్రను మరిచి.. ఇప్పుడు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ నీతిసూత్రాలు వల్లె వేస్తున్నారని మండిపడ్డారు.
న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమంలో 369 మంది విద్యార్థులను కాల్చిన చంపిన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి విద్యార్థుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పట్ల కర్కశ వైఖరి అవలంభించిన చరిత్రను మరిచి.. ఇప్పుడు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ నీతిసూత్రాలు వల్లె వేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద, మెదక్ జిల్లా సదాశివపేటలో విద్యార్థులను కాల్చి చంపటంపై రేవంత్‌రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు.
సోమవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఉద్యమంలో ఎక్కువ హింస జరగలేదని రాహుల్ గాంధీ బాధపడుతున్నట్లు అనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రశ్న పత్రాల లీకేజీలపై పార్లమెంటులో చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌లో పేపర్ లీక్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ధర్నాచౌక్‌లో నిరసనలపై నిషేధం విధించిన వ్యక్తి ఇవాళ ఉద్యమాల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి కూడా ఆయన హయాంలో జరిగిన ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణికి పీకేవోసీ వచ్చేలా చొరవ చూపాలి
కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేవోసీ (ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్)- డీప్ సైడ్ ఎక్స్‌టెన్షన్ బొగ్గు గని సింగరేణికి వచ్చేలా సీఎం రేవంత్ చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పీకేవోసీ గని కోసం తెలంగాణ జెన్‌కో కూడా టెండర్‌లో పాల్గొందని, ఆ టెండర్ నుంచి జెన్‌కో తప్పుకొని గని సింగరేణికి ఇచ్చేలా సీఎం చొరవ తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై సీఎంకు త్వరలో లేఖ రాస్తానని చెప్పారు. నైని, తాడిచర్ల 2, పీకేవోసీ గనులు సింగరేణికి లాభం చేకూర్చుతాయని, వీటి ద్వారా దాదాపు 6,500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సింగరేణికి రూ.1.95 లక్షల కోట్ల టర్నోవర్ వస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.40 వేల కోట్ల లాభం వస్తుందని వెల్లడించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సింగరేణికి పీకేవోసీ దక్కేలా చూడాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
తుంగభద్రలో పూడికతీతపై ఉప కమిటీ
బైబ్యాక్, ప్రీ లాంచ్ ప్లాట్ల పేరుతో మోసం