Share News

ధోనీకి ఆ హోదా ఇవ్వడంపై తొలుత సందేహించాను: వినోద్ భాటియా

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:34 PM

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి లెఫ్టినెంట్ కర్నల్‌ హోదా ఇవ్వడంపై మొదట్లో ఉన్న తన ఆలోచనాతీరులో మార్పు వచ్చినట్టు విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ధోనీకి ఆ హోదా ఇవ్వడంపై తొలుత సందేహించాను: వినోద్ భాటియా
MS Dhoni army service

ఇంటర్నెట్ డెస్క్‌: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన బ్యాటింగ్‌తో, వ్యూహాలతో భారత్‌కు పలు ఐసీసీ టైటిల్స్ అందించారు. అందుకే భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకటిగా నిలిచారు. కేవలం టీమిండియా కెప్టెన్‌గానే కాకుండా లెఫ్టినెంట్ కర్నల్‌ హోదాలో ఆర్మీలో పని చేసి.. తన దేశ భక్తిని చాటుకున్నారు ధోని. మిగతా క్రీడాకారుల మాదిరిగా నామా మాత్రంగా ఆ హోదాను ధోని అలంకరించలేదు. కఠినమైన శిక్షణనూ తీసుకుని నియంత్రణ రేఖ వద్ద పహారాకూ వెళ్లారు. ధోనికి హోదా ఇవ్వడంపై మొదట్లో ఉన్న తన ఆలోచనాతీరులో మార్పు వచ్చిందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఓ పాడ్‌కాస్ట్‌లో వినోద్ భాటియా మాట్లాడుతూ..‘ నేను ఆర్మీలో ఉన్నప్పుడు మా చీఫ్‌గా వీకే సింగ్‌ ఉన్నారు. టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఎంఎస్ ధోనికి గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. నేను కాస్త సంశయించాను. పారాచూట్ అర్హత కలిగిన సిబ్బందికి ఇచ్చే మెరూన్ బెరెట్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. పారాట్రూపర్‌ కావాలంటే తప్పకుండా 6 నెలల కఠిన శిక్షణ తీసుకోవాలి. ఇది చాలా కష్టమైన శిక్షణ. ఇక్కడ ఎంపికయ్యే వారు 20 శాతం మాత్రమే ఉంటారు. కానీ, ఎలాంటి శిక్షణ లేకుండానే ధోనికి ఇలా మెరూన్ బెరెట్‌ను ఇవ్వడం తప్పుడు సంకేతాలు పంపుతుందని భావించా’ అని వినోద్ భాటియా తెలిపారు.


'కఠినమైన పారాజంపింగ్‌ శిక్షణను ధోని విజయవంతంగా పూర్తి చేశారు. అంతేకాక దేశం కోసం ధోని చాలా సేవలు అందించి.. టీమిండియా గర్వపడేలా చేశారు. నేను కూడా ధోని సేవలకు గర్వపడ్డాను. ఓ సందర్భంలో ఎత్తు నుంచి దూకడం తనకు చాలా భయమని నాతో చెప్పినట్లు గుర్తు. ఇలాంటి కఠినమైన శిక్షణ ఎలా పూర్తి చేస్తాడో అని సందేహపడ్డాను. కానీ నా అనుమానాలను పటాపంచలు చేస్తూ వాటన్నింటినీ పక్కనపెట్టేసి పారాట్రూపర్ జంప్స్‌ పూర్తి చేసేశారు. తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తూ.. యూనిఫామ్‌ గౌరవాన్ని నిలబెట్టారు. నిజమైన సైనికుడిగా ధోని వ్యవహరించారు. జమ్ముకశ్మీర్‌లో మా యూనిట్‌తో కలిసి సేవలు అందించి.. మిగతావారిలోనూ చాలా స్ఫూర్తి నింపారు. అప్పటి నుంచి నా ఆలోచనా తీరును పూర్తిగా మార్చేశారు’ అని వినోద్ భాటియా వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పహల్గామ్ ఉగ్రదాడి అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్..

ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం: హరీశ్ రావు

Updated Date - Apr 22 , 2026 | 06:27 PM