Share News

స్మోకింగ్‌ చేస్తూ కెమెరాకు చిక్కిన గుజరాత్‌ స్టార్ బౌలర్

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:32 PM

గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్‌ బౌలర్‌ కగిసో రబాడ వివాదంలో చిక్కుకున్నాడు. హోటల్‌ పరిసరాల్లో సిగరెట్‌ కాలుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్మోకింగ్‌ చేస్తూ కెమెరాకు చిక్కిన గుజరాత్‌ స్టార్ బౌలర్
Kagiso Rabada smoking IPL 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్(IPL)2026లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ ధూమపానం చేస్తూ పట్టుబడ్డాడు. హోటల్‌ పరిసరాల్లో సిగరెట్‌ కాలుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసి అభిమానులు రబాడపై చర్యలుంటాయా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ 2026లో రబాడా గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు. అంతేకాక చక్కటి ప్రదర్శనతో ఆ జట్టులో కీలక ప్లేయర్‌గా మారాడు.


స్మోకింగ్‌పై ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌లో స్పష్టమైన నిషేధం లేదు. ఆ ప్రకారం సిగరెట్ తాగడం నిబంధనలకు వ్యతిరేకం కాదు. అయితే ఆటగాళ్ల ఫిట్‌నెస్, ప్రొఫెషనల్ ప్రవర్తన దృష్ట్యా ఇది విమర్శలకు దారి తీస్తోంది. రబాడకు డోపింగ్ ఉల్లంఘన నేపథ్యం ఉంది. 2025లో సౌతాఫ్రికా టీ20 సమయంలో అతను వినోదం కోసం నిషేధిత మాదకద్రవ్యాన్ని ఉపయోగించడంతో, సంబంధిత అధికారులు అతనిపై ఒక నెల నిషేధం విధించారు. దీంతో తాజాగా జరిగిన ఈ ఘటనను బీసీసీఐ యాంటీ-డోపింగ్ విభాగం పరిశీలించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. అతను వాడింది సిగరెట్ మాత్రమేనా? లేక మరేదైనా నిషేధిత పదార్థమా? అన్నది నిర్ధారించాల్సి ఉంటుంది. ఇక రబాడా స్మోక్ చేస్తున్న సమయంలో అతడితో పాటు గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన పలువురు సిబ్బంది కూడా ఉన్నారు.


మరోవైపు ఐపీఎల్ 2026 సీజన్‌లో రబాడ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు. జట్టు విషయానికొస్తే.. గుజరాత్‌ ఈ సీజన్‌లో ఓ మాదిరి ప్రదర్శనలతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 3 అపజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఈ జట్టు తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 24న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.


ఇవి కూడా చదవండి:

కోహ్లీ లాంటోడే కావాలి.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్

ప్యాట్ కమిన్స్ తిరిగొచ్చినా.. ఇషాన్ కిషనే కెప్టెన్‌గా ఉండాలి: సంజయ్ బంగర్

హార్దిక్‌తో విభేదాలు.. కృనాల్ పాండ్య రియాక్షన్ ఇదే!

Updated Date - Apr 22 , 2026 | 04:50 PM