డీలిమిటేషన్ ఆమోదానికి మ్యాజిక్ ఫిగర్ 360.. మద్దతు కూడగట్టే పనిలో కేంద్రం
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:04 PM
లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మురం చేసింది. బిల్లు పాస్ అయ్యేందుకు అవసరమైన 360 ఓట్ల మేజిక్ ఫిగర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు అనుకూలిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మురం చేసింది. బిల్లు పాస్ అయ్యేందుకు అవసరమైన 360 ఓట్ల మేజిక్ ఫిగర్‌ను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత రాజకీయ సమీకరణాలు అనుకూలిస్తే ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్ వర్గం) పార్టీలు ఈసారి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాలవారీగా లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచుతామనే హామీని బిల్లు ముసాయిదాలోనే చేరిస్తే, మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ రెండు పార్టీలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌తో తమిళనాడులో రాజకీయ విభేదాల నేపథ్యంలో ఇండియా కూటమి నుంచి వైదొలిగిన డీఎంకే కూడా తన వైఖరిని మార్చుకుంది. బిల్లుపై వ్యతిరేకతను పక్కనపెట్టింది. డీలిమిటేషన్ అనంతరం పార్లమెంటులో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.2 శాతం ప్రాతినిధ్యం కొనసాగాలని డీఎంకే కోరుతోంది. రాష్ట్రాలవారీగా సీట్లను 50 శాతం పెంచుతామనే నిబంధనను బిల్లులో చేరిస్తే తమకు అభ్యంతరం లేదని డీఎంకే తెలిపింది. ఆ పార్టీకి లోక్‌సభలో 22 మంది ఎంపీలు ఉన్నారు.
ఏప్రిల్ 17న రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, 298 మంది బిల్లుకు అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజ్యాంగ సవరణ ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీకి 352 ఓట్లు కావాల్సి ఉండగా, 54 ఓట్లు తక్కువ పడ్డాయి. ప్రస్తుతం లోక్‌సభలో 540 మంది సభ్యులు పూర్తిస్థాయిలో హాజరైతే మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేందుకు సుమారు 360 ఓట్లు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కొందరు ఎంపీలు గైర్హాజరైతే అవసరమైన ఓట్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది.
ఎన్డీయేకు ప్రస్తుతం 319 మంది సభ్యుల మద్దతు ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇందులో బీజేపీకి చెందిన ఎంపీలు 241 మంది ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 28 మంది ఎంపీల్లో 20 మంది పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఏర్పడిన ఎన్‌సీపీఐలో చేరి ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నారు. అలాగే, పంజాబ్‌కు చెందిన శిరోమణి అకాలీదళ్ నుంచి మరో ఎంపీ మద్దతు కూడా కేంద్ర ప్రభుత్వానికి లభించింది. ఇక శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన ఎనిమిది మంది ఎంపీల మద్దతు లభిస్తే ఎన్డీయే బలం 328కి చేరుతుంది. డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీల మద్దతు కూడా లభిస్తే మొత్తం బలం 350కి చేరుతుంది. అయినప్పటికీ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీని సాధించేందుకు మరో 10 ఓట్లు అవసరమవుతాయి. దీంతో మిగిలిన ఓట్లను సమీకరించడంపై కేంద్రం దృష్టి సారించింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్