Share News

పశ్చిమ సరిహద్దులో మరో ఎస్‌ 400ను తరలించనున్న భారత్‌

ABN , Publish Date - Nov 27 , 2026 | 10:14 AM

పాకిస్థాన్‌ నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో పశ్చిమ సరిహద్దులో మరో ఎస్‌ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను మోహరించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి సుమారు 740 కిలోమీటర్ల మేర గగనతల రక్షణను మరింత పటిష్టం చేయనుంది.

పశ్చిమ సరిహద్దులో మరో ఎస్‌ 400ను తరలించనున్న భారత్‌

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్‌ నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో పశ్చిమ సరిహద్దులో మరో ఎస్‌ 400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను మోహరించేందుకు భారత్‌ సిద్ధమవుతోంది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి సుమారు 740 కిలోమీటర్ల మేర గగనతల రక్షణను మరింత పటిష్టం చేయనుంది. వచ్చే ఫిబ్రవరి నాటికి ఎస్ 400ను తరలించాలని భారత వాయుసేన (ఐఏఎఫ్) లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భారత్‌ వద్ద నాలుగు ఎస్‌ 400 వ్యవస్థలు ఉన్నాయి. వాటిలో మూడింటిని పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌లో మోహరించారు. ఇవి పశ్చిమ దిశ నుంచి వచ్చే వైమానిక ముప్పులను ఎదుర్కొనేందుకు రక్షణ కవచంగా పనిచేస్తున్నాయి. నాలుగో ఎస్ 400ను అసోంలో ఏర్పాటు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌‌లోని 1,126 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి భద్రత కోసం దీనిని వాడుతున్నారు. మరోవైపు వచ్చే సంవత్సరం రష్యా నుంచి మరో ఐదు ఎస్‌ 400లను కొనుగోలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.


శత్రు వైమానిక దాడులకు అడ్డుకట్ట

ఎస్‌ 400 వ్యవస్థ ఆధునిక వైమానిక రక్షణ సామర్థ్యాలకు పెట్టింది పేరు. బాలిస్టిక్‌ క్షిపణులు, యుద్ధ విమానాలు, మానవరహిత యుద్ధ విమానాలు, డ్రోన్లు వంటి వాటిని 40 నుంచి 400 కిలోమీటర్ల పరిధిలోనే ఎస్ 400 గుర్తించి అడ్డుకోగలదు. ఆపరేషన్‌ సిందూర్‌లోనూ ఇది వ్యవస్థ కీలకంగా పనిచేసింది. పాకిస్థాన్‌ ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణులు, రాకెట్లను ఎస్‌ 400 సమర్థంగా అడ్డుకుంది. అంతేకాకుండా పాక్ యుద్ధ విమానాలను కూడా కూల్చివేసింది.


పాక్‌కు విదేశీ శక్తుల సాయం

పాకిస్థాన్‌‌కు కొన్ని దేశాలు సైనికపరంగా సాయం చేస్తున్నట్లు కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎస్‌ 400 వ్యవస్థల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు అమెరికా ఎఫ్‌ 16 యుద్ధ విమానాల ఆధునికీకరణ ప్యాకేజీని అందించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. టర్కీ కూడా పాకిస్థాన్‌ వద్ద ఉన్న అగోస్టా 90బీ జలాంతర్గాములను ఆధునికీకరిస్తోందని, దీర్ఘశ్రేణి ఆత్మాహుతి డ్రోన్లను కూడా సరఫరా చేస్తోందని తెలిసింది. మరోవైపు చైనా ఇప్పటికే వింగ్‌ లూంగ్‌-2 డ్రోన్లను పాకిస్థాన్‌కు అందించింది. 2027లో జే 35 ఐదో తరం యుద్ధ విమానాలను కూడా సరఫరా చేయనున్నట్లు సమాచారం.


ఈ వార్తలూ చదవండి

అహంకారం వద్దు.. కలిసి పనిచేయాలి.. ఎస్పీతో సీట్ల పంచాయితీ వేళ ఖర్గే కీలక వ్యాఖ్యలు..

జాతీయ రహదారిపై విమానాల ల్యాండింగ్.. చరిత్ర సృష్టించిన భారత సైన్యం..

Updated Date - Nov 27 , 2026 | 10:14 AM