నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 15 మంది మృతి
ABN , Publish Date - Mar 01 , 2026 | 10:20 AM
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్బీఎల్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మరణించారు.
ఇంటర్నెట్ డెస్క్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ఏపీలోని కాకినాడ జిల్లాలో భారీ పేలుడు ఘటనలో 22 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని కటోల్ ప్రాంతంలో పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమ ఎస్బీఎల్(SBL) ఎనర్జీ లిమిటెడ్‌లో ఈ ఘటన (Nagpur Massive Explosion) జరిగింది. ప్రమాదం జరిగిన పరిశ్రమలో డిటోనేటర్లు, కాస్ట్ బూస్టర్లు, భూకంప పేలుడు పదార్థాలు తయారు చేస్తారని తెలుస్తోంది. ఎస్బీఎల్‌లోని ఓ యూనిట్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ సమయంలో 20 మందికి పైగా ఉద్యోగులు వివిధ యూనిట్లలో పనిచేస్తున్నారు. ఈ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో 15 మంది మరణించారు. ఈ ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను కలిగించింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు,ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మరికొందరి పరిస్థితి విషమం..
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి ఈ పరిశ్రమ గోడౌన్ పూర్తిగా నేలమట్టమైంది. ఈ ప్రమాదం ధాటికి చుట్టుపక్కల ఉన్న ఇతర భవనాలు కూడా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక యంత్రాలు గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ గోడౌన్‌లో అనుమతించిన పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో పేలుడు పదార్థాలను నిల్వ చేయడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని సమాచారం.
సహాయక ఆపరేషన్..
భవనం శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారేమోననే అనుమానంతో రెస్క్యూ టీమ్స్ గాలింపు చర్యలు చేపట్టాయి. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల విషయంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించారా..?, గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయా..? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటనతో ఆయా బాణసంచా కేంద్రాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన.. భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News