రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి
ABN , Publish Date - Nov 12 , 2026 | 08:45 PM
రసగుల్లా అంటూ బాంబు ఇవ్వడంతో దానిని కొరికి ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా పడారియా గ్రామంలో ఈనెల 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: రసగుల్లా అంటూ బాంబు ఇవ్వడంతో దానిని కొరికి ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లా పడారియా గ్రామంలో ఈనెల 10న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పడారియా గ్రామానికి చెందిన రాజేంద్ర బరోటియా తన ఇంట్లో ఉండగా.. అదే గ్రామానికి చెందిన రామ్ భగత్ బరోటియా.. రాజేంద్ర ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో రామ్ భగత్ ఒక వస్తువును రాజేంద్రకు ఇచ్చాడు. అది రసగుల్లా అని చెప్పాడు. చీకటిగా ఉండడంతో రాజేంద్ర దానిని గుర్తించలేకపోయాడు. రసగుల్లా అనుకొని ఆ బాంబును నోట్లో పెట్టుకుని కొరకడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై రాజేంద్ర భార్య సుశీలాబాయి మాట్లాడుతూ అది జంతువులను చంపేందుకు ఉపయోగించే నాటు బాంబు అని తెలిపారు. పేలుడు శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూశారని, తన భర్తను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లామని ఆమె వెల్లడించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారని చెప్పారు. నాటుబాంబు అందించిన రామ్ భగత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే తనకు ఓ బాలుడు ఆ బాంబు ఇచ్చాడని రామ్ భగత్ తెలిపాడు. ఆ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. రాజేంద్ర బరోటియా, రామ్ భగత్ బరోటియా మధ్య ఏమైనా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్విడియా సీఈఓ ఎఫైర్ గురించి కూతురికి ముందే తెలుసా?
ఎన్విడియా సీఈవో జెన్సెన్ హువాంగ్‌కు పదవీ గండం.. తెరపైకి మరో అఫైర్..