Share News

I-PAC Raidas Drama: ఐప్యాక్ దాడులకు నిరసనగా మమత భారీ ప్రదర్శన... సీజేఐను ఆశ్రయించిన ఈడీ

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:32 PM

కోల్‌కతా హైకోర్టులో కేసు విచారణ వాయిదా పడటంతో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్‌ను ఈడీ శుక్రవారంనాడు ఆశ్రయించింది. తక్షణ విచారణ కోసం ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది.

I-PAC Raidas Drama:  ఐప్యాక్ దాడులకు నిరసనగా మమత భారీ ప్రదర్శన... సీజేఐను ఆశ్రయించిన ఈడీ
Mamata Banerjee

కోల్‌కతా: ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC), దాని సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్‌పై ఈడీ దాడుల వ్యవహారం రచ్చకెక్కింది. దీనిపై శుక్రవారం నాడు కేంద్రం, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మధ్య ఘర్షణ మరింత తీవ్రమైంది. అవినీతిలో కూరుకుపోయారంటూ తనపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు, ఈడీ చర్యలపై ముఖ్యమంత్రి మమతాబెనర్జీ.. కోల్‌కతా రోడ్లపైకి వచ్చి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు ఈడీ సైతం కోల్‌కతా హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


ఐప్యాక్‌పై ఈడీ దాడులకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై కోల్‌కతా హైకోర్టు జస్టిస్ సువ్ర ఘోష్ విచారణ చేపట్టినప్పటికీ భారీగా జనం హాజరుకావడంతో ఆయన కోర్టు రూమ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. గత వారంరోజులుగా కోర్టుకు సెలవులు ఉండగా.. ఈ అంశంపై వచ్చే బుధవారం నాడు తిరిగి విచారణ చేపట్టనున్నారు.


సీజేఐకి ఈడీ విజ్ఞప్తి

కోల్‌కతా హైకోర్టులో కేసు విచారణ వాయిదా పడటంతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్‌ను ఈడీ శుక్రవారం నాడు ఆశ్రయించింది. తక్షణ విచారణ కోసం ధర్మాసనం ఏర్పాటు చేయాలని కోరింది. కాగా, హైకోర్టులో శుక్రవారం విచారణ సందర్భంగా ఈడీ తమ వాదన వినిపిస్తూ, ఐప్యాక్ కార్యాలయం, జైన్ నివాసంలో తాము సోదాలు నిర్వహిస్తుండగా అధికారులతో అడ్డగించడం ద్వారా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించింది. దీనిపై జైన్, తృణమూల్ కాంగ్రెస్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన డాక్యుమెంట్లను సీజ్ చేయాలని ఈడీ ప్రయత్నించిందని ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ఒకవైపు కోర్టు విచారణ జరుగుతుండగా మరోవైపు ఈడీ దాడులకు నిరసనగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ జాదవ్‌పూర్ నుంచి హజ్రా క్రాసింగ్ వరకూ 5 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర నిర్వహించారు. పెద్దఎత్తున కార్యకర్తలు, పార్టీ నేతలు ఇందులో పాల్గొన్నారు.


ఆరోపణల పర్వం

ఏం చేసైనా సరే పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని మమతా బెనర్జీ, తృణమూల్ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. టీఎంసీ చీఫ్ అవినీతి ఊబిలో కూరుకుపోయారని, ఈడీ అధికారులను బెదిరిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మమతా చర్యల వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని.. తనను, తమ పార్టీని చిక్కుల్లోకి నెట్టే కీలకమైన సమాచారాన్ని తొలగించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు.


ఇవి కూడా చదవండి..

అమిత్ షా ఆఫీస్‌ ముందు ఆందోళన.. టీఎంసీ ఎంపీలు అరెస్ట్

సమస్య ఏదైనా నెహ్రూను విమర్శించడం సరికాదు.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 09 , 2026 | 07:19 PM