Protest Outside Amit Shah Office: అమిత్ షా ఆఫీస్ ముందు ఆందోళన.. టీఎంసీ ఎంపీలు అరెస్ట్
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:20 PM
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం టీఎంసీ ఎంపీలు నిరసన చేపట్టారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అక్కడినుంచి పంపించారు..
కోల్‌కతాలో ఈడీ దాడులను ఖండిస్తూ టీఎంసీ ఎంపీలు ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం ముందు నిరసనలు చేపట్టారు. శుక్రవారం ఉదయం టీఎంసీ ఎంపీలు డెరెక్ ఓబ్రెయిన్, శతాబ్ది రాయ్, మహువా మొయిత్రా, కీర్తి ఆజాద్‌తో పాటు మరికొంతమంది నిరసనలు చేపట్టారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఎంపీలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అతి కష్టం మీద వారిని అక్కడి నుంచి పార్లమెంట్ స్ట్రీట్ పీఎస్‌కు తరలించారు.
ఈడీ దాడులపై మమతా ఆగ్రహం..
రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో గురువారం ఈడీ సోదాలు నిర్వహించింది. కోల్‌కతాలోని ఆయన నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడకు చేరుకున్నారు. ఈడీ తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా మమతా మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ఐటీ సెల్ చీఫ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. మా పార్టీకి సంబంధించిన దస్త్రాలు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మా పార్టీ అభ్యర్థుల వివరాలు వాటిలో ఉన్నాయి. వాటిని వెనక్కు తీసుకున్నా’..
‘మా పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్లను ఈడీ తీసుకోవచ్చా? నేను ఇలాగే బీజేపీ ఆఫీసుకు వెళితే పరిస్థితి ఏమిటి? ఓటర్ జాబితా సమగ్ర సవరణ పేరిట ఇప్పటికే 5 లక్షల మంది పేర్లను తొలగించారు. కేవలం ఎన్నికలు జరగనున్నాయనే ఇలా చేస్తున్నారు’.. అంటూ మండిపడ్డారు. కాగా, కేంద్రం రాజకీయ లబ్ధి కోసం ఈడీని అస్త్రంగా వాడుతోందని టీఎంసీ పార్టీ నేతలు అంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు సైతం పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
వైసీపీ నాయకుడి కంకర మిషన్ మూసివేత
నేను రోహిత్‌ను కెప్టెన్ అనే అంటాను.. జై షా ఆసక్తికర వ్యాఖ్యలు