Jay Shah: నేను రోహిత్‌ను కెప్టెన్ అనే అంటాను.. జై షా ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:45 AM
టీమిండియా వెటరన్ స్టార్ రోహిత్ శర్మ టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో ఐసీసీ ఛైర్మన్ జై షా రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ను కెప్టెన్ అనే పిలుస్తానని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ ఛైర్మన్ జై షా.. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ కార్యక్రమంలో రోహిత్‌ను జై షా కెప్టెన్ అంటూ పిలిచారు. అతడిని కేవలం కెప్టెన్ అని మాత్రమే పిలుస్తాననడంతో హిట్‌మ్యాన్ చిరునవ్వులు చిందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
‘మన కెప్టెన్ ఇక్కడే ఉన్నాడు. నేను అతడిని కెప్టెన్ అని మాత్రమే పిలుస్తాను. రోహిత్(Rohit Sharma) నాకు ఎప్పటికీ కెప్టెనే. అతడు టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలందించాడు. 2023 ప్రపంచ కప్ టోర్నీలో భారత జట్టు వరుసగా పది మ్యాచుల్లో విజయం సాధించింది. అభిమానుల హృదయాలు గెలుచుకుంది. కానీ కప్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. నేను ఫిబ్రవరి 2024లో ఓ విషయం చెప్పాను. వచ్చే వరల్డ్ కప్‌లో మనం ట్రోఫీతో పాటు అభిమానుల హృదయాలను గెలుచుకోబోతున్నాం’ అని జై షా(Jay Shah) ఆ కార్యక్రమంలో అన్నారు.
రికార్డు స్థాయిలో విజయాలు..
రోహిత్ శర్మ డిసెంబర్ 2021లో టీమిండియా వన్డే జట్టు పగ్గాలు అందుకున్నాడు. అతడి సారథ్యంలో 56 మ్యాచులు ఆడిన భారత జట్టు రికార్డు స్థాయిలో 42 విజయాలను సొంతం చేసుకుంది. 12 వన్డేల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ టై కాగా మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రోహిత్ నాయకత్వంలో టీమిండియా 2018లో ఆసియా కప్ సొంతం చేసుకుంది. 2023 వన్డే వరల్డ్ కప్‌లో అజేయంగా ఫైనల్ వరకు దూసుకెళ్లింది. 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. రోహిత్ శర్మ కేవలం వన్డేల్లోనే కాదు.. టీ20 ఫార్మాట్‌లోనూ విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డ్ సృష్టించాడు. అతడి సారథ్యంలో 62 మ్యాచులకు గానూ 49 టీ20ల్లో టీమిండియా విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
టెస్టులకు 15 రోజుల ప్రిపరేషన్ విండో.. గిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ల ప్రశంసలు!