Shashi Tahroor: సమస్య ఏదైనా నెహ్రూను విమర్శించడం సరికాదు.. శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 03:33 PM
ఇండియా-చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ కొన్ని కేసుల్లో వారి (మోదీ ప్రభుత్వం) విమర్శలకు ఆధారాలుండవచ్చని, ఆ యుద్ధంలో చైనాపై ఓటమికి నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు కారణం కావచ్చని శశిథరూర్ అన్నారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తూ బీజేపీకి దగ్గరవుతున్నారంటూ కొంతకాలంగా విమర్శలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Taharoor) తాజాగా భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (Jawaharalal Nehru)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెహ్రూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థాపకుడని కొనియాడారు. అయితే నెహ్రూపై తన అభిమానం గుడ్డిది కాదని అన్నారు. నెహ్రూ పొరపాట్లు చేసి ఉండొచ్చని, అయితే దేశంలోని అన్ని సమస్యలకూ ఆయనే కారణమంటూ నిందించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. నెహ్రూ వారసత్వంపై బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంటర్నేషన్ బుక్ ఫెస్టివల్‌లో (KLIBF)లో శశిథరూర్ మాట్లాడారు.
'నేను నెహ్రూ అభిమానిని. అయితే ఆయన నమ్మకాలు, విధానాలన్నింటికీ గుడ్డిగా తలాడించను. ఆయన ఆలోచనా దృక్పథం ప్రశంసనీయమైంది. ఆయన తీసుకున్న అనేక చర్యలు ప్రశంసలకు అర్హమైనవి. ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఆయన దృఢంగా నెలకొల్పారు. అలా అని వారు (మోదీ ప్రభుత్వం) ప్రజాస్వామి వ్యతిరేకులని కాదు. అయితే నిశ్చయంగా వారు నెహ్రూ వ్యతిరేకులు. సమస్య ఏదైనా నెహ్రూను వారు విమర్శలు చేస్తూనే ఉన్నారు' అని శశిథరూర్ వ్యాఖ్యానించారు.
ఇండియా-చైనా మధ్య 1962లో జరిగిన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, కొన్ని కేసుల్లో వారి (మోదీ ప్రభుత్వం) విమర్శలకు ఆధారాలుండవచ్చని, ఆ యుద్ధంలో చైనాపై ఓటమికి నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు కారణం కావచ్చని అన్నారు. అయితే సమస్య ఏదైనా ప్రతిదానికి వాళ్లు నెహ్రూను నిందించడం మాత్రం సరికాదని అన్నారు.
రచయితగా తన జర్నీని ప్రస్తావిస్తూ, చిన్నప్పుడు ఆస్తమా కారణంగా తాను పుస్తకాలు చదవడాన్ని ఎక్కువగా ఇష్టపడేవాడినని, అప్పుడు టెలివిజన్ కానీ, మొబైల్ ఫోన్లు కానీ లేవని, పుస్తకాలే తన సహచరులని థరూర్ చెప్పారు. చాలా చిన్నప్పుడే తాను తొలి నవల రాశానని, అయితే సిరా ఒలికపోవడంతో ఆ పుస్తకాన్ని కోల్పోయానని తెలిపారు. శ్రీ నారాయణ్ గురు బయోగ్రఫీ తన 28వ పుస్తకమని చెప్పారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో పుస్తక పఠనం తగ్గిపోయిందని, కానీ కేరళలో మాత్రం రీడింగ్ కల్చర్ కొనసాగుతోందన్నారు.
ఇవి కూడా చదవండి..
క్రిమినల్ సిండికేట్‌లా వ్యవహరించిన లాలూ కుటుంబం.. ఐఆర్‌సీటీసీ స్కామ్‌పై ఢిల్లీ కోర్టు
అమిత్ షా ఆఫీస్ ముందు ఆందోళన.. టీఎంసీ ఎంపీలు అరెస్ట్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి