Lalu Prasad Yadav: క్రిమినల్ సిండికేట్‌లా వ్యవహరించిన లాలూ కుటుంబం.. ఐఆర్‌సీటీసీ స్కామ్‌పై ఢిల్లీ కోర్టు
ABN , Publish Date - Jan 09 , 2026 | 02:40 PM
లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్టు బలమైన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ: భూములకు ఉద్యోగాల కుంభకోణంలో (Land for Job Scam) ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), అయన కుటుంబ సభ్యులపై అభియోగాల నమోదుకు ఢిల్లీ కోర్టు శుక్రవారంనాడు ఆదేశాలిచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖను తన వ్యక్తిగత సామ్రాజ్యంగా భావించి క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్‌గా మార్చారని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ గోగ్నే తప్పుపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలను బేరసారాల చిప్‌గా ఉపయోగించుకుని రైల్వే అధికారులు, సన్నిహితులతో కుమ్మక్కై భూములు పొందారని కీలక వ్యాఖ్యలు చేశారు.
లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మిసా భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్టు బలమైన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది. భూములను ఆక్రమించుకునేందుకు క్రిమినల్ ఎంటర్‌ప్రైజ్ నడిపారని లాలూ, ఆయన కుటుంబ సభ్యులను తప్పుపట్టింది. ఈ కేసులో తమను నిర్దోషులుగా విడుదల చేయాలని లాలూ కుటుంబం చేసిన పిటిషన్ ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అభియోగాల నమోదుకు ఆదేశాలిస్తూ విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది.
లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 మధ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇండియన్ రైల్వే గ్రూప్-డి కేటగిరి పోస్టులను నియామకాలు జరిపారు. ఇందుకు బదులుగా వారి భూములను లాలూ కుటుంబ సభ్యులతో పాటు ఓ ప్రైవేటు కంపెనీకి బదిలీ చేశారని సీబీఐ అధికారులు ఆరోపించారు. మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద లాలూపై ట్రయిల్ కోర్టు అభియోగాలను మోపింది. అయితే.. ఈ ఉత్తర్వులపై లాలూ ప్రసాద్ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవని నిందితులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
అమిత్ షా ఆఫీస్ ముందు ఆందోళన.. టీఎంసీ ఎంపీలు అరెస్ట్
స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణకు కేంద్రం నయా ప్లాన్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి