Share News

Mamata Banerjee: బెంగాల్‌లో హైడ్రామా!

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:24 AM

రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు తనిఖీలు చేశారు. కోల్‌కతాలోని ఆయన ఇంట్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేశారు.

Mamata Banerjee: బెంగాల్‌లో హైడ్రామా!

  • ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

  • ఆయన ఇంటికెళ్లిన సీఎం మమతా బెనర్జీ

  • ఈడీ దాడులు రాజ్యాంగ విరుద్ధం

  • మా పార్టీ రాజకీయ వ్యూహాలను చోరీ చేశారు

  • కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మమత

  • జైన్‌ ఇంటి నుంచి పత్రాలు, హార్డ్‌ డిస్కులు తీసుకెళ్లిపోయిన మమత అనుచరులు

  • మనీలాండరింగ్‌ కేసులో భాగంగానే తనిఖీలు

  • మమత కీలక ఆధారాలను ఎత్తుకెళ్లారు: ఈడీ

  • తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కలకత్తా హైకోర్టుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ

  • నేడు బెంగాల్‌ వ్యాప్తంగా టీఎంసీ నిరసనలు

న్యూఢిల్లీ/కోల్‌కతా, జనవరి 8: రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు తనిఖీలు చేశారు. కోల్‌కతాలోని ఆయన ఇంట్లో గురువారం ఈడీ అధికారులు సోదాలు చేశారు. బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ప్రతీక్‌ జైన్‌ నివాసంలో సోదాలు చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. ఉదయం నుంచి ఆయన నివాసంతోపాటు ఐ-ప్యాక్‌కు సంబంధించిన పలు ప్రాంగణాల్లో దాడులు చేసింది. అయితే, సోదాలు జరుగుతున్న సమయంలోనే బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ అధికారులు జైన్‌ నివాసంలో తనిఖీలు చేస్తుండగా.. మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీసు కమిషనర్‌ మనోజ్‌ వర్మతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఈడీ సోదాలు రాజ్యాంగవిరుద్ధమని మండిపడ్డారు. రాజకీయ కుట్ర లో భాగంగానే తమ పార్టీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి ప్రతీక్‌ జైన్‌ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘మా పార్టీ రాజకీయ వ్యూహం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని చోరీ చేసేందుకే ఈడీతో దాడులు చేయిస్తున్నారు. టీఎంసీ పార్టీ హార్డ్‌డి్‌స్కలను తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు’’ అని మమత ఆరోపించారు. రాజకీయ పార్టీ సమాచారాన్ని సేకరించడమే ఈడీ పనా? అని నిలదీశారు. రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఈడీతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు.


ఐ-ప్యాక్‌ కార్యాలయాల్లో ఎవరూ లేని సమయంలో, ఉదయం 6 గంటల నుంచే సోదాలు ప్రారంభించారని, తమ పార్టీ రాజకీయ వ్యూహం, ఇతర సమాచారం మొత్తాన్ని వారి కంప్యూటర్లలోకి ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారని ఆరోపించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈసీ వద్ద నమోదైన రాజకీయ పార్టీ అని.. క్రమం తప్పకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నామని తెలిపారు. తాము ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులమని.. ఈడీకి ఏమైనా సమాచారం కావాలంటే ఐటీ శాఖ నుంచి తీసుకోవచ్చని మమత సూచించారు. బీజేపీ పెద్ద దొంగల పార్టీ అని.. తాజా ఈడీ దాడులకు ప్రతిగా తాము బీజేపీ కార్యాలయాల్లో దాడులు చేయిస్తే ఏం చేస్తారని నిలదీశారు. తాము సంయమనంతో వ్యవహరిస్తున్నారని.. దాన్ని బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు. కాగా, ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలో సీఎం మమత అక్కడ ఉండగానే ఆమె అనుచరులు చాలా ఫైళ్లు తీసుకెళ్లి కారులో పెట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మమత 20-25 నిమిషాల పాటు ప్రతీక్‌ జైన్‌ నివాసంలోనే ఉన్నారు. ఆమె అక్కడి నుంచి వెళ్లేటప్పుడు చేతిలో గ్రీన్‌ ఫోల్టర్‌ ఉండడం గమనార్హం. మధ్యాహ్నం 1 గంట సమయంలో మమత ఐ-ప్యాక్‌ ఆఫీసుకు వెళ్లారు. ఆ సమయంలో మంత్రు లు, టీఎంసీ నేతలతో పాటు డీజీపీ రాజీవ్‌ కుమార్‌ కూడా అక్కడకు చేరుకున్నారు. ఐ-ప్యాక్‌ ఆఫీసు ఉన్న భవనం లోపలికి, బయటకి వెళ్లే ద్వారాలను ఈడీ అధికారులు మూసివేశారు. అయితే, మమత బేస్‌మెంట్‌ నుంచి భవనంలోకి వెళ్లి సాధారణ లిఫ్ట్‌ ద్వారా 11వ అంతస్తులోని కార్యాలయానికి చేరుకున్నారు. బెంగాల్‌లో గెలవాలనుకుంటే రాజకీయంగా ఎదుర్కోవాలని బీజేపీకి సవాలు విసిరారు. జైన్‌ ఆఫీసుకు వచ్చిన తర్వాత సాయంత్రం 4.15 గంటల సమయంలో మమత అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా, ఈడీ దాడులకు నిరసనగా శుక్రవారం ర్యాలీ నిర్వహించనున్నట్లు మమత వెల్లడించారు.


మమత కీలక ఆధారాలను ఎత్తుకెళ్లారు: ఈడీ

బొగ్గు అక్రమ రవాణాకు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఐ-ప్యాక్‌ డైరెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ నివాసంలో సోదాలు జరుపుతుండగా.. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వచ్చి కీలక ఆధారాలను తీసుకెళ్లిపోయారని ఈడీ ఆరోపించింది. కొన్ని పత్రాలతో పాటు హార్డ్‌ డిస్క్‌లను కూడా ఆమె ఎత్తుకెళ్లిపోయారని ఓ ప్రకటనలో తెలిపింది. ఐ-ప్యాక్‌ కార్యాలయం నుంచి మమత, ఆమె అనుచరులు, పోలీసులు బలవంతంగా పత్రాలు, హార్డ్‌ డిస్క్‌లను తీసుకెళ్లిపోయారని పేర్కొంది. 2020లో నమోదైన బొగ్గు అక్రమ రవాణా కేసులో భాగంగా బెంగాల్‌లో ఆరు చోట్ల, ఢిల్లీలో నాలుగు చోట్ల తనిఖీలు చేసినట్లు వెల్లడించింది. కేసులో నిందితుడిగా ఉన్న హవాలా నిర్వాహకుడు ఒకరు ఐ-ప్యాక్‌తో రూ.కోట్లలో నగదు లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని తెలిపింది. అందులో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. సీఎం మమత, కోల్‌కతా సీపీ కలిసి తమ విచారణ కు అడ్డంకులు సృష్టించారని ప్రకటనలో తెలిపింది. తాము ఏ పార్టీనీ లక్ష్యంగా చేసుకోలేదని, పార్టీ కా ర్యాలయాల్లో తనిఖీలు చేయలేదని స్పష్టం చేసింది. ఎన్నికలకు, ఈ సోదాలకు సంబంధం లేదని.. చట్టప్రకారమే తాము మనీలాండరింగ్‌ ఆరోపణలపై సోదాలు నిర్వహించామని తేల్చిచెప్పింది. కాగా, తమ విచారణకు అడ్డంకులు సృష్టించారన్న ఆరోపణలపై పిటిషన్‌ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో సీఎం జోక్యం చేసుకోవడాన్ని ప్రశ్నించింది. విచారణలో తమకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోర్టును కోరింది.

టీఎంసీకి ‘కళ్లు, చెవులు’గా ఐ-ప్యాక్‌: కాంగ్రెస్‌

ఐ-ప్యాక్‌ సంస్థ టీఎంసీకి కళ్లు, చెవులుగా మారిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధరి ఆరోపించారు. ఆ సంస్థ బెంగాల్‌లో టీఎంసీ గెలుపు కోసం రాజకీయంగా అనైతిక, కుట్ర కార్యకలాపాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఒక కార్పొరేట్‌ సంస్థలో ఈడీ దాడులు చేస్తుంటే మమతాబెనర్జీ ఎందుకంత ఆందోళన చెందుతున్నారని ప్రశ్నించారు.


ఇంట్లో చోరీ జరిగింది.. ప్రతీక్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు

ఈడీపై ప్రతీక్‌ జైన్‌ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో కొన్ని విలువైన పత్రాలను ఈడీ చోరీ చేసిందంటూ జైన్‌ భార్య ఆరోపించారు. సోదాల అనంతరం ఈడీ అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు జైన్‌ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే జైన్‌ భార్య స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి.. అత్యవసరమైన పత్రాలను ఈడీ చోరీ చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిందని, విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు.

మమతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి: బీజేపీ

ఈడీ దాడులు జరుగుతుండగా ప్రతీక్‌ జైన్‌ నివాసానికి సీఎం మమతాబెనర్జీ వెళ్లడాన్ని బీజేపీ తప్పుపట్టింది. ఇది దర్యాప్తులో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడమే అవుతుందని బెంగాల్‌ ప్రతిపక్ష నేత, బీజేపీ నాయకుడు సువేందు అధికారి పేర్కొన్నారు. ఇలాంటి ప్రవర్తన అనైతికమని మండిపడ్డారు. ఆమెపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల విధులకు ఆటంకం కలిగించడం ఆమెకు కొత్తేమీ కాదని.. ఇది అలవాటుగా మారిందని చెప్పారు. సీఎంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని దర్యాప్తు సంస్థలను కోరారు. లేకపోతే రాష్ట్ర ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 04:24 AM