Central Govt: స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణకు కేంద్రం నయా ప్లాన్..
ABN , Publish Date - Jan 09 , 2026 | 11:18 AM
స్లీపర్ బస్సు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘిస్తున్న బస్సులపై, అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు..
న్యూఢిల్లీ, జనవరి 9: గత ఏడాది దేశంలోని పలు రాష్ట్రాల్లో ఘోర బస్సు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. ప్రైవేటు స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురవడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్లీపర్ బస్సు ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్థానికంగా పనిచేసే మాన్యువల్ స్లీపర్ బస్సు బాడీ బిల్డర్లకు కాకుండా.. కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆటోమొబైల్ కంపెనీలు, తయారీ సంస్థలకే బస్సుల తయారీకి అనుమతి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ ప్రకటన జారీ చేసింది.
అందుకే ఇలాంటి నిర్ణయం: గడ్కరీ
ఏపీ, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన బస్సు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) అన్నారు. ఈ బస్సు ప్రమాదాలకు అనేక కారణాలు ఉన్నాయని నివేదికల్లో తేలిందన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు బయటపడిందన్నారు. అంతే కాకుండా అగ్నిప్రమాదం జరిగిన సమయాల్లో మంటలను నియంత్రించేందుకు అవసరమైన పరికరాలు బస్సుల్లో లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమైందని చెప్పారు. అలాగే బస్సుల్లో తరచూ తనిఖీలు చేపట్టకపోవడం కూడా మరో కారణమని నివేదికల్లో తేలిందని చెప్పారు. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు..
బస్సు ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే బస్సులను తయారు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పుడు ఉన్న అన్ని స్లీపర్ బస్సుల్లో అగ్నిప్రమాద గుర్తింపు వ్యవస్థ, ప్రతి ఎమర్జెన్సీ ఎగ్జిట్ వద్ద సుత్తి, అత్యవసర లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించే బస్సులు, అలాగే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నాలజీ..
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రి తెలిపారు. కార్లలో ఉచిత స్పెక్ట్రమ్‌ను ఉపయోగించి వాహనం నుంచి వాహనానికి (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ V2V టెక్నాలజీ ద్వారా వాహనాలు తమ వేగం, స్థానం, దిశ వంటి కీలక సమాచారాన్ని సమీప వాహనాలతో పంచుకోగలవని ఆయన వివరించారు.
ఈ టెక్నాలజీ వల్ల అకస్మాత్తుగా బ్రేక్ వేసినా.. రోడ్డుపై వాహనాలు ఆగి ఉన్నా.. మిగతా వాహనాలకు అలర్ట్ వెళ్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. తద్వారా ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ వైర్‌లెస్ కమ్యూనికేషన్ వ్యవస్థను అన్ని వాహనాల్లో అభివృద్ధి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. ఈ సాంకేతికత రోడ్డు భద్రతను మరింత మెరుగుపరుస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
చరిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్
ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
Read Latest National News And Telugu News