Vehicle Registration: ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:17 AM
కొత్తగా వాహనం కొనుగోలు చేసే వారు ఇకపై వాహన రిజిస్ట్రేషన్‌కు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు.
స్పీడ్ పోస్టులో నేరుగా ఇంటికే ఆర్‌సీ కార్డు
రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కొత్తగా వాహనం కొనుగోలు చేసే వారు ఇకపై వాహన రిజిస్ట్రేషన్‌కు రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వాహనం కొనుగోలు చేసిన షోరూం వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. వాహన రిజిస్ట్రేషన్ కార్డు(ఆర్‌సీ) నేరుగా యజమాని ఇంటికి స్పీడ్ పోస్టులో వచ్చేస్తుంది. నూతన విధానం అమలు కోసం రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వాహన్, సారథి పోర్టళ్లను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చే చర్యల్లో భాగంగా ఇకపై షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించారు. రాష్ట్రంలో సగటున ఏటా 6 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.75 లక్షల కార్లు రిజిస్టర్ అవుతున్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబరు(టీఆర్) షోరూంలోనే ఇస్తున్నారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సైతం అక్కడే పూర్తి కానుంది. వాహనాన్ని విక్రయించిన డీలరే.. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాల(ఇన్వాయిస్, ఫారం-21, ఫారం-22, బీమా, చిరునామా రుజువు, వాహన ఫొటోలు)ను అప్‌లోడ్ చేశాక.. రవాణా శాఖ అధికారి నంబరు కేటాయిస్తారు. అవసరమనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్ వద్ద షోరూంలోనే వాహనాన్ని తనిఖీ చేస్తారు. వాహనదారులు కోరుకున్న ఫ్యాన్సీ నంబరు కావాలంటే మాత్రం రవాణా శాఖ అధికారులు ఆ సిరీస్ విడుదల చేసే వరకు వేచి ఉండాలి. ప్రజలకు మెరుగైన, సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన విధానం అమల్లోకి తెచ్చినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. నూతన విధానంతో రవాణా శాఖ కార్యాలయంలో స్లాట్ బుకింగ్, క్యూ లైన్‌లో వెయిటింగ్, కార్డు కోసం తిప్పలు తప్పనున్నాయి. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తి కానుంది. కాగా, వాణిజ్య వాహనాలకు మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్నట్టుగానే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.