Share News

కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో ఖర్గే, దేవెగౌడ

ABN , Publish Date - May 23 , 2026 | 05:08 PM

కర్ణాటకతో సహా 10 రాష్ట్రాల నుంచి ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రాజకీయ వేడి ఊపందుకుంటోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జేడీ(ఎస్) సుప్రీం హెచ్‌డీ దేవెగౌడను రెండోసారి రాజ్యసభకు పంపే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.

కర్ణాటక నుంచి రాజ్యసభ రేసులో ఖర్గే, దేవెగౌడ
Mallikarjun Kharge and Deve Gowda

బెంగళూరు: కర్ణాటకతో సహా 10 రాష్ట్రాల నుంచి ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రాజకీయ వేడి ఊపందుకుంటోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జేడీ(ఎస్) సుప్రీం హెచ్‌డీ దేవెగౌడను కర్ణాటక నుంచి రెండోసారి రాజ్యసభకు పంపే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.


బీజేపీ రాజ్యసభ సభ్యులైన ఈరన్న బి కడాడి, కె.నారాయణతో పాటు మల్లికార్జున్ ఖర్గే, దేవెగౌడల రాజ్యసభ పదవీకాలం జూన్ 25వ తేదీతో ముగియనుంది. కర్ణాటకలో బలాబలాల పరంగా చూస్తే కాంగ్రెస్‌కు కర్ణాటక నుంచి 3 సీట్లు గెలుచుకునే బలం ఉంది. ఎన్డీయే ఒక సీటు గెలుచుకోగలదు.


కర్ణాటకలో నాయకత్వ మార్పు జరుగనుందంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మల్లికార్జున్ ఖర్గే రీ-నామినేషన్ వ్యవహారం తెరపైకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్డీయే పరంగా చూస్తే జేడీ(ఎస్)తో పొత్తు పదిలం చేసుకోవాలంటే బీజేపీ తమకున్న ఏకైక సీటును దేవెగౌడకు వదులుకోవాల్సి ఉంటుంది. అయితే బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మాజీ సీఎం డీవీ సదానంద గౌడ పేరును బుధవారంనాడు ప్రతిపాదించింది. దీనిపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాధా మోహన్ అగర్వాల్ మాట్లాడుతూ, రాష్ట్ర విభాగం ఒక పేరును ప్రతిపాదించిందని, అయితే కూటమి నిర్ణయాలనేవి కేంద్ర నాయకత్వమే తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.


పరిశీలనలో సుప్రియ, షర్మిల పేర్లు

మరోవైపు కాంగ్రెస్ సైతం పలువురు పేర్లను పరిశీలనలోకి తీసుకోనున్నట్టు తెలుస్తోంది. వీరిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సుప్రియ శ్రీనతే, పవన్ ఖేరా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్.షర్మిల, ఏఐసీసీ కార్యదర్శి బీవీ శ్రీనివాస్‌లు ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్ కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకుని లింగాయత్, ఓబీసీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. లింగాయత్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే కేపీసీసీ ప్రధాన కార్యదర్శి బసవరాజు ఏపీని ప్రధాన పోటీదారుగా చెప్పుకోవచ్చు. ఇతర ఆశావహుల్లో ఎంఎల్‌సీ బీకే హరిప్రసాద్ (ఓబీసీ), మైసూరు డీసీసీ అధ్యక్షుడు విజయ్ (ఓబీసీ), రాష్ట్ర మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు పుష్ప అమరనాథ్ (దళిత్), మాజీ ఎమ్మెల్యే అంజలి నింబాల్కర్ (ఓబీసీ), ఏఐసీసీ సెక్రటరీ (కేరళ, లక్షద్వీప్) మన్సూర్ అలి ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మోదీ ప్రభుత్వం దోచుకుంటోంది: మల్లికార్జున్ ఖర్గే..

మోదీకి ఝల్‌మురి అమ్మిన విక్రమ్‌ సావోకు బెదిరింపులు

Updated Date - May 23 , 2026 | 05:13 PM