10 ఏళ్ల బాలిక హత్యా ఘటన.. స్పందించిన సీఎం విజయ్
ABN , Publish Date - May 23 , 2026 | 03:49 PM
తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సరకుల కోసం బయటకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించబోమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.
కోయంబత్తూరు, మే 23: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. సరకుల కోసం బయటకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. గురువారం సాయంత్రం కనిపించకుండా పోయిన బాలిక.. శుక్రవారం శవమై కనిపించింది. సూలూరు ప్రాంతంలోని కన్నంపాలయం సరస్సు సమీపంలో శుక్రవారం గాయాలతో బాలిక మృతదేహం లభ్యమైంది. ఆమెను అపహరించి, ఆ తర్వాత హత్య చేశారనే ఆరోపణలపై పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందించారు. ఇలాంటి ఘటనలను సహించబోమని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కోయంబత్తూరు జిల్లా సూలూరు ప్రాంతంలోని తన ఇంటి దగ్గర సరకులు కొనడానికి బాలిక బయటకు వెళ్లింది. అదే సమయంలో నిందితులు బాలికను అపహరించి, ఆ తర్వాత హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితులను కార్తీక్, మోహన్ రాజ్‌గా గుర్తించారు. ఈ ఘటన అనంతరం, బాలిక తల్లిదండ్రులు, బంధువులు న్యాయం కోరుతూ సూలూరు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పందిస్తూ.. 'కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలిక హత్యా ఘటన తీవ్ర దుఃఖాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది. ఇలాంటి అమానుషమైన, క్షమించరాని నేరపూరిత చర్యలను మన సమాజంలో ఎన్నటికీ సహించలేం. నిందితులను కఠినంగా శిక్షిస్తాం' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి నుంచి హామీ లభించే వరకు మార్చురీ నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బాధితురాలి కుటుంబం నిరాకరించిన నేపథ్యంలో సీఎం విజయ్ పై విధంగా స్పందించారు.
ఈ కేసు దర్యాప్తును సమీక్షించేందుకు తమిళనాడు పోలీస్ డైరెక్టర్ జనరల్ సందీప్ రాయ్ రాథోర్ కోయంబత్తూరుకు హుటాహుటిన చేరుకున్నారు. శాంతిభద్రతల పరిస్థితిపై టీవీకే ప్రభుత్వాన్ని డీఎంకే నేతలు విమర్శించడంతో ఈ కేసు రాజకీయ మలుపు తిరిగింది. ఈ నేపథ్యంలో టీవీకే నాయకులు ఆసుపత్రిలో ఉన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఎం.ఎస్. సంపత్ ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించి బాధితురాలి కుటుంబాన్ని కలిశారు. అనంతరం సంపత్ మాట్లాడుతూ, తాను ఈ కేసుపై ముఖ్యమంత్రితో మాట్లాడానని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. నిందితులకు అత్యంత కఠిన శిక్ష విధిస్తామని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
రాజౌరిలో ఎన్‌కౌంటర్, బలగాల ఉచ్చుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు
కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..