నాలుగేళ్లుగా బాలికను వేధిస్తున్న బాక్సింగ్ కోచ్!.. కేసు నమోదు
ABN , Publish Date - May 23 , 2026 | 03:00 PM
బెంగళూరులో ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో బాక్సింగ్ కోచ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరులో మరోసారి అత్యాచార ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నగరంలోని కంఠీరవ స్టేడియంలో లయన్స్ బాక్సింగ్ క్లబ్‌కు చెందిన ఓ కోచ్.. తనను లైంగికంగా వేధిస్తున్నాడని 17 ఏళ్ల అమ్మాయి ఆరోపించింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సదరు బాక్సింగ్ శిక్షణ కేంద్రంలో పదేళ్లుగా ఆ అమ్మాయి తర్ఫీదు పొందుతోంది. రామచంద్ర అనే వ్యక్తి ఆమెకు కోచింగ్ ఇస్తున్నాడు. అయితే.. అతడు నాలుగేళ్లుగా ఆమెను వేధిస్తున్నాడని, ఐదారు నెలల నుంచి ఈ ఘటనలు మరింత తీవ్రమయ్యాయని ఆరోపించారు. మే 17న చెన్నైలో జరిగిన బాక్సింగ్ పోటీల సందర్భంగా.. ఆ అమ్మాయిని, కోచ్ తన ప్రైవేట్ గదికి పిలిపించి చాలా అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. శిక్షణ సమయంలోనూ పలుమార్లు అనుచితంగా దగ్గరయ్యేందుకు యత్నించాడని ఎఫ్ఐఆర్‌లో రాసుకొచ్చారు. ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు చెబితే చంపేస్తానని బెదిరించినట్టు కూడా ఫిర్యాదులో తెలిపారు.
అయితే.. ఈ వేధింపులకు సంబంధించి గతంలోనే ఓ కమిటీ ముందు ఫిర్యాదు సమర్పించారని ఎఫ్ఐర్‌లో పేర్కొన్నారు. ఈ ఘటనపై కోచ్ రామచంద్రపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.
ఇవీ చదవండి:
కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..
మరణానికి ముందు సెలూన్‌ను సందర్శించిన ట్విషా.. యజమాని సంచలన ఆరోపణలు