Share News

మరణానికి ముందు సెలూన్‌ను సందర్శించిన ట్విషా.. యజమాని సంచలన ఆరోపణలు

ABN , Publish Date - May 23 , 2026 | 11:44 AM

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ట్విషా శర్మ మృతి కేసుకు సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. మే 12న ఆమె ఓ సెలూన్ షాప్‌ను సందర్శించినట్టు దాని యజమాని తెలిపారు.

మరణానికి ముందు సెలూన్‌ను సందర్శించిన ట్విషా.. యజమాని సంచలన ఆరోపణలు
Twisha Sharma

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మాజీ మిస్‌ పుణె, ఎంబీఏ గ్రాడ్యుయేట్ ట్విషా శర్మ మృతి కేసుకు సంబంధించి పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఇంట్లో ఉరివేసుకుని కనిపించడానికి కొన్ని గంటల ముందే ఓ సెలూన్‌ షాప్‌ను సందర్శించింది. సంబంధిత సీసీటీవీ ఫుటేజీ బయటకు వచ్చింది. సుమారు 3 గంటలసేపు సెలూన్‌లో ఉన్న ట్విషా.. హెడ్ మసాజ్, పెడిక్యూర్ చేయించుకున్నట్టు కనిపిస్తోంది.


ట్విషా.. మే 12న మధ్యాహ్నం 3:12 గంటల ప్రాంతంలో సెలూన్‌లోకి వెళ్లి, సాయంత్రం 6:15 గంటలకు బయటకు వెళ్లారని సెలూన్ షాప్ యజమాని కిరణ్ పారిహర్ తెలిపారు. ఆ తర్వాతి రోజు ట్విషా అత్త గిరిబాలా సింగ్(సమర్థ్ సింగ్ తల్లి) ఆమె వివరాలపై పదే పదే ఆరా తీశారన్నారు. 'ట్విషా శర్మ.. మా సెలూన్‌కు తరచుగా వస్తుంటారు. గతంలోనూ ఆమె నాలుగైదు సార్లు వచ్చారు. అయితే.. ఈసారి సుమారు 9 నెలల విరామం తర్వాత వచ్చారు. మరుసటి రోజు ఉదయం గిరిబాల సింగ్.. ట్విషా సెలూన్‌కు వచ్చినప్పటి సీసీటీవీ ఫుటేజీ కావాలని ఫోన్ చేశారు' అని కిరణ్ చెప్పారు.


తన కోడలు ట్విషా.. సెలూన్‌కు ఎప్పుడు వచ్చించో, ఏ సమయంలో తిరిగి వెళ్లిందో స్పష్టంగా తెలపాలని గిరిబాలా సింగ్ కోరినట్టు షాప్ యాజమాని చెప్పారు. అలాగే ఆమె ఏ రకంగా డబ్బు చెల్లించారో.. ఆమె సెలూన్ సందర్శనకు సంబంధించి ఏదైనా ప్రూఫ్ లేదా రికార్డ్స్ కావాలని ఆమె పదే పదే అడిగారన్నారు. అయితే.. ట్విషా ఆ సమయంలో తనకు ఎలాంటి నగదు చెల్లించలేదని, గతంలోనే ప్రీపెయిడ్ ప్యాకేజీ తీసుకున్నారని పారిహర్ చెప్పారు. ఆ తర్వాత గిరిబాలా నుంచి మరోసారి ఫోన్ వచ్చిందని.. ట్విషా యోగక్షేమాల గురించి అడగ్గా.. ఆమె చనిపోయారని సమాధానమిచ్చినట్టు యజమాని చెప్పుకొచ్చారు. కాసేపటికే లాయర్ వస్త్రధారణతో కూడిన ఐదారుగురు వ్యక్తులు తన షాప్ వద్దకు వచ్చి.. తాము అడ్వకేట్లమని పరిచయం చేసుకుని సీసీటీవీ ఫుటేజీ తీసుకెళ్లారని పేర్కొన్నారు.


అయితే.. తాము న్యాయవాదులమని చెప్పుకున్న ఆ బృందంలోని సభ్యుల గుర్తింపులు తెలియరాలేదు. దీంతో ట్విషా శర్మ మృతికేసు ఇంకా మిస్టరీగానే ఉంది. పోస్ట్‌మార్టం నివేదిక, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం.. ట్విషాది ఆత్మహత్యేనని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో ఆమె కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ట్విషా మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే.. పది రోజులుగా పరారీలో ఉన్న భర్త సమర్థ్ సింగ్‌ను ఎట్టకేలకు పోలీసులు మే 22న అరెస్ట్ చేశారు. నేడు అతణ్ని కోర్టులో హాజరుపరచనున్నారు.


ఇవీ చదవండి:

భారత్‌కు చేరుకున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి

35కు చేరిన విజయ్‌ మంత్రివర్గం

Updated Date - May 23 , 2026 | 12:06 PM