19వ రోజ్‌గార్ మేళా.. మోదీ చేతుల మీదుగా 51వేల మందికి నియామక పత్రాలు
ABN , Publish Date - May 23 , 2026 | 02:13 PM
దేశవ్యాప్తంగా మరో 51 వేల ఉద్యోగాలను భర్తీ చేసింది కేంద్రం. శనివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన 19వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో సంబంధిత నియామకాలు అందజేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఇంటర్నెట్ డెస్క్: నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని కేంద్రం మరోసారి భారీఎత్తున నిర్వహించింది. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో శనివారం ఈ కార్యక్రమం ఏకకాలంలో జరిగింది. 19వ రోజ్‌గార్ మేళా సందర్భంగా.. కొత్తగా ఎంపికైన 51వేల మంది అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా నియామక పత్రాలు అందజేశారు. యువత సాధికారత, ఉపాధి కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.
ఈ నియామకాలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని ఆయా విభాగాల్లో జరిగాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులు విధులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ సేవల్లోకి అడుగుపెడుతున్న యువత దేశ అభివృద్ధిలో కీలక భాగస్వాములవుతారని ప్రధాని పేర్కొన్నారు. 'భారతదేశం ప్రపంచ సాంకేతిక రంగంలో వేగంగా ఎదుగుతోంది. నైపుణ్యాలు కలిగిన యువతకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో కొత్త బాధ్యతలు చేపట్టనున్న యువత వికసిత భారత్ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తోంది' అని యువతను ఉద్దేశించి ప్రసంగించారు మోదీ.
కాగా.. 2022లో రోజ్‌గార్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్రం. దీని ద్వారా ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేయడం సహా ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల నియామకాలు చేపట్టినట్టు కేంద్రం వెల్లడించింది.
ఇవీ చదవండి:
కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..
మరణానికి ముందు సెలూన్‌ను సందర్శించిన ట్విషా.. యజమాని సంచలన ఆరోపణలు