Share News

కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..

ABN , Publish Date - May 23 , 2026 | 12:39 PM

లద్దాఖ్‌లోని పర్వత ప్రాంతాల్లో ఓ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు భారత సైనికాధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే.. ఈ ఘటన అనంతరం ఆర్మీ అధికారి తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

కూలిన హెలికాప్టర్.. మేజర్ జనరల్ సెల్ఫీ..

ఇంటర్నెట్ డెస్క్: లద్దాఖ్‌లోని లెహ్ సమీపంలో ఉన్న పర్వత ప్రాంతమైన టాంగ్‌స్టేలో హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో ముగ్గురు భారత సైనికాధికారులు త్రుటిలో ప్రాణపాయం నుంచి బయటపడ్డారు. మే 20న జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు, డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ సచిన్ మెహతా గాయపడ్డారని సైనిక అధికారులు శనివారం ధ్రువీకరించారు.


చీతా విమాన సముదాయానికి చెందిన సింగిల్ ఇంజిన్ హెలికాప్టర్‌‌ను లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ నడుపుతుండగా.. 3వ పదాతిదళ విభాగానికి జనరల్ ఆఫీసర్ కమాండింగ్‌గా ఉన్న మేజర్ జనరల్ సచిన్ మెహతా అందులో ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురూ గాయపడినప్పటికీ ప్రస్తుతం వారు క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే.. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తునకు ఆదేశించినట్లు సైన్యం తెలిపింది. ఇదిలా ఉండగా.. ‌ప్రమాదం అనంతరం మేజర్ జనరల్ మెహతా తీసుకున్న సెల్ఫీ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. తీవ్రంగా దెబ్బతిన్న హెలికాప్టర్ సమీపంలోని రాళ్లపై వారు కూర్చుని దిగిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


ఇక.. 1970వ దశకంలో తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన చీతా హెలికాప్టర్ల భద్రతపై జరిగిన తాజా ప్రమాదం మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.1984లో సియాచిన్ గ్లేషియర్‌లో పాకిస్థానీ దళాలకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్‌ మేఘదూత్‌లో కీలకపాత్ర పోషించిన ఈ హెలికాప్టర్లు.. కొన్నేళ్లుగా అనేక ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో పలువురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు కూర్చునే వీలున్న చీతా హెలికాప్టర్‌ను ప్రపంచంలోనే అత్యధిక ఎత్తు ఎగిరే అత్యుత్తమ హెలికాప్టర్లలో ఒకటిగా పరిగణిస్తారు. అయితే.. ఈ విమాన సముదాయాన్ని దశలవారీగా తొలగిస్తూ ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించిన స్వదేశీ తేలికపాటి యుటిలిటీ హెలికాప్టర్(LUH)ను ప్రవేశపెడుతున్నారు.

Army Selfie.jpg


ఇవీ చదవండి:

మరణానికి ముందు సెలూన్‌ను సందర్శించిన ట్విషా.. యజమాని సంచలన ఆరోపణలు

రోడ్డు పక్కన వ్యాన్‌లో.. కూరగాయల్లా కప్పల అమ్మకం.. వీడియో వైరల్

Updated Date - May 23 , 2026 | 12:59 PM