పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి మోదీ ప్రభుత్వం దోచుకుంటోంది: మల్లికార్జున్ ఖర్గే..
ABN , Publish Date - May 23 , 2026 | 04:18 PM
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎనిమిది రోజుల వ్యవధిలోనే మూడు సార్లు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచడంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎనిమిది రోజుల వ్యవధిలోనే మూడు సార్లు ధరలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరలతో దేశ ప్రజలను బీజేపీ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌పై రోజువారీగా రూ.1,000 కోట్ల పన్నులను కేంద్రం విధిస్తోందని.. అయినా మోదీ ప్రభుత్వానికి అత్యాశ తీరలేదని ఖర్గే విమర్శించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ.. ఆ ప్రయోజనాలను దేశ ప్రజలకు అందించలేదని ఖర్గే నిప్పులు చెరిగారు. ఇది ప్రజలను నిర్దాక్షిణ్యంగా దోచుకోవడమేనని మండిపడ్డారు. సంక్షోభం వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ మునిగిపోయిందని, ఆ తర్వాత ఇప్పుడు త్యాగం గొప్పతనం గురించి చెబుతోందని ఆయన విమర్శించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఇంధన ధరలు అత్యంత తక్కువగా ఉన్నాయని కమలం పార్టీ నేతలు చెబుతున్నారని ఖర్గే ఆగ్రహించారు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన తర్వాత అంతా బాగానే ఉందని భారతీయులకు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని అన్నారు.
కానీ అదే సమయంలో ఇతర దేశాలు తమ పౌరులకు చురుకుగా సహాయాన్ని అందించాయని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. ఇంధనంపై ఇటలీ ఎక్సైజ్ సుంకాలను తగ్గించి పౌరులకు ఉపశమనం కలిగించిందని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఎక్సైజ్ సుంకం తగ్గించడంతో పెట్రోల్ ధరలు లీటరుకు సుమారు రూ.17 తగ్గాయని ఆయన తెలిపారు. చమురుపై జర్మనీ పన్నులు తగ్గించడంతో ఇంధన ధరలు లీటరుకు రూ.17 నుంచి రూ.19 వరకు తగ్గిపోయాయని వెల్లడించారు. అలాగే యూకేలో ప్రతి ఇంటికీ చమురు సంబంధిత ఆర్థిక సహాయంగా ప్రభుత్వం 100 పౌండ్లు అందించడంతో పాటు ఇంధనం, విద్యుత్ రెండింటిపైనా పన్నులను తగ్గించిందని ఖర్గే చెప్పుకొచ్చారు.
ఐర్లాండ్ 250 మిలియన్ యూరోలను సాయం కింద ప్రజలకు అందించిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు తెలిపారు. దీంతో పెట్రోల్ ధర లీటరుకు సుమారు 0.15 యూరోలు, డీజిల్ ధర లీటరుకు 0.20 యూరోలు తగ్గాయని చెప్పారు. మన దేశంలో మాత్రం రేట్లు పెంచుతూ దోపిడీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దోపిడీ ద్వారా వస్తున్న సొమ్ము ఎవరికి చేరుతోంది? అంటూ ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం చాలా స్పష్టంగా కనిపిస్తోందని, ఈ విషయాన్ని ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయులు గ్రహించారని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
10 ఏళ్ల బాలిక హత్యా ఘటన.. స్పందించిన సీఎం విజయ్
కాక్‌రోచ్ జనతా పార్టీ వెబ్‌సైట్ తొలగింపు.. కేంద్రంపై అభిజీత్ దీప్కే మండిపాటు..