గడ్చిరోలిలో కాల్పుల కలకలం.. ముగ్గురు మావోయిస్టుల మృతి
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:03 PM
మహారాష్ట్ర - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లా ఫొదేవా అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. గురువారం ప్రారంభమైన ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీస్ అధికారి విధి నిర్వహణలో వీరమరణం పొందారు.
ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీస్ భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులు జరిగాయి. గడ్చిరోలి అడవుల్లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో భారీ నష్టం వాటిల్లింది. అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో.. పోలీసులు, భద్రతా బలగాలు నిన్నటి(గురువారం) నుంచి గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు అడవిలోకి ప్రవేశించగానే మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి. ప్రతిగా బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఈ హోరాహోరీ పోరులో కమాండో దీపక్ ప్రాణాలు కోల్పోగా, గాయపడిన మరో అధికారిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ఏకే-47, SLR స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు.
కొనసాగుతున్న ఆపరేషన్..
ఘటనా స్థలంలో పోలీసులు.. ఆయుధాలు, విప్లవ సాహిత్యం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఇంకా కొందరు మావోయిస్టులు దాగిఉండే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో గడ్చిరోలి జిల్లాలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. స్థానికులను అప్రమత్తం చేసిన అధికారులు.. అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని సూచనలు జారీ చేశారు. ఎన్‌కౌంటర్ పూర్తైన తర్వాత మృతుల సంఖ్య, స్వాధీనం చేసుకున్న ఆయుధాల వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భాగ్యనగరంలో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్
నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు..
Read Latest Telangana News And AP News And Telugu News