Share News

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!

ABN , Publish Date - Mar 27 , 2026 | 03:29 PM

మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వీడియో కలకలం రేపుతోంది. ఓ మంత్రి మహిళా ట్రాన్స్‌జెండర్‌తో రాసలీలలు ఆడినట్టు ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండటమే దీనికి కారణం. పూర్తి వివరాల్లోకెళితే...

మంత్రి వీడియో వైరల్.. 'మహా' రాజకీయాల్లో దుమారం.!
Maharashtra Minister Narhari Zirwal

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎన్‌సీపీ నేత, ఆహార, ఔషధ నియంత్రణ శాఖ మంత్రి నరహరి జిర్వాల్ తన అధికారిక నివాసంలో ఓ మహిళా ట్రాన్స్‌జెండర్‌తో అభ్యంతరకంగా ప్రవర్తించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది అశ్లీలమైన, అనైతిక ప్రవర్తన అని ఆరోపించింది. సదరు మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.


అయితే.. ఈ ఆరోపణలను జిర్వాల్ తీవ్రంగా ఖండించారు. కొందరు వ్యక్తులు కావాలనే వీడియోను మార్ఫింగ్ చేసి, తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. ఆ వీడియోలోని వ్యక్తి తనకు ఐదేళ్లుగా తెలుసని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియోపై నరహరి సోదరుడు ఎన్‌సీపీ నేత రవి యాదవ్ మాట్లాడుతూ.. ట్రాన్స్‌జెండర్ వెనుక పలువురు కీలక నేతలున్నారన్నారు. ట్రాన్స్‌జెండర్ కోటాలో ఎమ్మెల్సీ సహా పలు కీలక పదవులు పొందేందుకే ఈ రకంగా కుట్రలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. నరహరినే కాదు.. గతంలో తననూ ఇదే తరహాలో ఓ ట్రాన్స్‌జెండర్ బెదిరించారని గుర్తుచేశారు రవి.


ఇక.. ఎన్‌సీపీ నేత అమోల్ మిత్కరి మాత్రం ఈ వీడియోను పూర్తి రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 'ఈ వీడియో చాలా పాతది. అసెంబ్లీ సెషన్ ముగిసిన వెంటనే ఎందుకు బయటకు వచ్చింది? జ్యోతిష్యుడు అశోక్ ఖరాట్ కేసును డైవర్ట్ చేసేందుకే ఇలా చేస్తున్నారు. అజిత్ పవార్ మృతిచెందాక.. ఆయన సతీమణి సునేత్రా పవార్‌ను ఎన్‌సీపీ అధ్యక్షురాలిగా నియమించాలని జిర్వాల్ పట్టుబట్టారు. అప్పటినుంచి ఆయన్ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి' అని చెప్పారు. మరోవైపు.. ఇలాంటి ఘటనలు రాష్ట్రానికే అవమానకరమని, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని కాంగ్రెస్ నేత వడెట్టివార్ మంత్రి ప్రవర్తనను విమర్శించారు. ఈ విషయమై సామాజిక కార్యకర్త అంజలి దమానియా స్పందిస్తూ.. 'ఈ ఘటన సిగ్గుచేటు. గతంలో ఆయనో లంచం కేసులోనూ ఇరుక్కున్నారు. ఇలాంటి వ్యక్తులను పదవిలో ఉంచడం పార్టీకే అవమానం' అని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారామె.


ఏది ఏమైనా.. ఈ వీడియో వివాదం ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఓవైపు బ్లాక్‌మెయిల్ ఆరోపణలు, మరోవైపు రాజకీయ కుట్రలు, ఎన్‌సీపీ అంతర్గత విభేదాలు, ప్రతిపక్ష నేతల ఒత్తిళ్లు వెరసి మంత్రి జిర్వాల్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి.


ఇవీ చదవండి:

కేబీసీలో రూ. 50 లక్షలు గెలిచి.. రూ. 2.5 కోట్ల స్కామ్‌లో అరెస్టై..

ఎరువుల కొరత లేదు, ఆందోళన వద్దు: లోక్‌సభలో జేపీ నడ్డా

Updated Date - Mar 27 , 2026 | 03:46 PM