Share News

ఎల్‌పీజీ కొరత.. లాక్‌డౌన్ ఉంటుందా? కేంద్ర మంత్రి సమాధానం ఇదీ

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:21 AM

భారత్‌లో ఎల్‌పీజీ కొరత కారణంగా లాక్ డౌన్ ఉండవచ్చన్న కథనాలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ స్పందించారు. అలాంటి ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.

ఎల్‌పీజీ కొరత.. లాక్‌డౌన్ ఉంటుందా? కేంద్ర మంత్రి సమాధానం ఇదీ
Union Minister Hardeep Singh Puri Responds Over Lockdown Rumours

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఎల్‌పీజీ కొరత నేపథ్యంలో లాక్ డౌన్ తప్పదన్న వదంతులు ఎక్కువయ్యాయి. ఈ భయాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఫుల్ స్టాప్ పెట్టింది. భారత్‌లో లాక్‌డౌన్ (Lockdown) విధించవచ్చన్న కథనాలు పూర్తిగా అవాస్తవమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పురీ (Hardeep Singh Puri) తాజాగా స్పష్టం చేశారు. ప్రజలపై, ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని తెలిపారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

‘అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇంధనాలు, అత్యవసర వస్తువుల సరఫరాలో మార్పులను మేము నిరంతరం గమనిస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రం అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు ఇంధనం, విద్యుత్, ఇతర నిత్యావసరాల సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతర్జాతీయ సవాళ్లు ఎదురైన ప్రతిసారీ భారత్ దీటుగా ఎదుర్కొంది. ఈసారి కూడా అదే పంథాలో అందరితో కలిసి సమన్వయంతో ముందుకు సాగుతున్నాము’


‘అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇక లాక్‌డౌన్ ఉంటుందన్న కథనాలు పూర్తిగా అవాస్తవం. ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెబుతున్నా. ఇలాంటి ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేవు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో మనం అందరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఆందోళన చెందకుండా ఐక్యంగా ఉండాలి. భయాందోళనలు కలిగించేలా వదంతులు వ్యాపింపజేయడం బాధ్యతాయుత వైఖరి అనిపించుకోదు. ఇది హానికరం’ అని ఆయన ఎక్స్ వేదికగా చెప్పారు.


ఈ వార్తలూ చదవండి:

అంతర్జాతీయ ధరల నుంచి భారతీయులకు రక్షణ కల్పించిన ప్రధాని: మంత్రి పురీ

లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 పెంచిన ‘నయారా’

Updated Date - Mar 27 , 2026 | 12:17 PM