ఐఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఎత్తుకుపోయారు.. కానీ పుస్తకాలు మాత్రం ముట్టుకోలేదు
ABN , Publish Date - Sep 29 , 2026 | 07:33 PM
లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోని ఓ మాల్‌పై కొందరు నిరసనకారులు విరుచుకుపడ్డారు. లక్షల రూపాయలు విలువచేసే ఐఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు ఎత్తుకుపోయారు. కానీ అక్కడ ఉన్న పుస్తకాలను మాత్రం ముట్టుకోలేదు.
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్‌పీయూ)లో విద్యార్థుల నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. వారు వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే ఈ నిరసనలో కొందరు ఎల్‌పీయూలోని యూని మాల్‌పై విరుచుకుపడ్డారు. అందులో ఉన్న ఆస్తులను ఎత్తుకుపోయారు. లక్షల రూపాయలు విలువచేసే మొబైల్ ఫోన్లను, ల్యాప్‌ట్యాప్‌లను పట్టుకుపోయారు. కానీ అక్కడ ఉన్న పుస్తకాల షాప్‌ను ముట్టుకోలేదు. ఒక్క పుస్తకాన్ని కూడా ఎత్తుకెళ్లలేదు. ఖరీదైన పర్ఫ్యూమ్‌లను, విలువైన వస్తువులను మాత్రం తీసుకువెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
అయితే ఆ మాల్‌ను నిరసనకారులు ధ్వంసం చేసినా.. పుస్తకాల షాప్ మాత్రం చెక్కు చెదరలేదు. అసలు అటువైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడలేదు. ‘వాళ్లు పుస్తకాలను వదిలేశారు. ఎందుకంటే అవి వారికి ఎందుకూ ఉపయోగపడవు కాబట్టి’ అని మాల్ సిబ్బంది తెలిపారు. విద్యార్థుల కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేసిన యూని మాల్‌లో అనేక రిటైల్ షాపులున్నాయి. అక్కడ ఖరీదైన వస్తువులను విక్రయిస్తారు. నిరసనకారులు వాటిపై పడి సర్వం దోచేశారని షాపు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వస్తువులనే కాకుండా కౌంటర్‌లోని నగదును దొంగలించారని ఆరోపిస్తున్నారు.
రిపేరింగ్ కోసం వచ్చిన ఫోన్లనూ వదలలేదు
ఈ నిరసనల కారణంగా ఎలక్ట్రానిక్స్ షాపు యజమాని తీవ్రంగా నష్టపోయారు. ‘నా షాపులో కొత్త ఫోన్లు, పాత ఫోన్లు, ఆఖరికి రిపేరింగ్ కోసం వచ్చిన మొబైల్స్‌ను వదలకుండా తీసుకుపోయారు’ అని ఆయన వాపోయారు. అలాగే ఎయిర్‌పాడ్స్, హెడ్‌ఫోన్స్, ఇంకా చాలా ఖరీదైన సామగ్రిని దోచేశారని చెప్పారు. ఈ ఒక్కరోజే తనకు రూ.50 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు.
ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. వాటిపై యూజర్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు మాల్‌పై పడి దోచుకుంది తాము కాదని.. వారు బయటి వ్యక్తులని ఎల్‌పీయూ విద్యార్థులు చెబుతున్నారు.
ఎందుకీ నిరసనలు..?
గత శనివారం రాత్రి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీంతో విద్యార్థులు నిరసనకు దిగారు. సెప్టెంబర్ 24న యూనివర్సిటీ హాస్టల్లో ఉన్న ఓ యువతిపై కొందరు దారుణానికి ఒడిగట్టారని వారు ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం వదంతులను కొట్టిపారేసింది. అసత్యాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని తెలిపింది. వాటిని విశ్వసించొద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించింది.
ఈ వార్తలూ చదవండి
ఎన్‌సీపీసీఆర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి..
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైన్యంపై ఉగ్రదాడి.. జవాన్ మృతి