Share News

భారత్ అణు శక్తి బలోపేతం.. 190 వార్‌హెడ్‌లు, మూడు మార్గాల్లో వ్యూహాత్మక సామర్థ్యం

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:44 PM

దేశ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ, తన అణు శక్తిని వేగంగా ఆధునీకరిస్తోంది. తాజాగా ఓ నివేదిక ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్‌హెడ్‌లు అందుబాటులో ఉన్నట్లు అంచనా.

భారత్ అణు శక్తి బలోపేతం.. 190 వార్‌హెడ్‌లు, మూడు మార్గాల్లో వ్యూహాత్మక సామర్థ్యం
India Nuclear Warheads

ఢిల్లీ, అక్టోబర్ 04: దేశ రక్షణ రంగంలో భారత్ సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ, తన అణు శక్తిని (Nuclear Deterrence) వేగంగా ఆధునీకరిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 'బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్స్' (BAS) తాజా నివేదిక ప్రకారం.. భారత్ వద్ద ప్రస్తుతం సుమారు 190 అణు వార్‌హెడ్‌లు అందుబాటులో ఉన్నట్లు అంచనా. శత్రువుల నుంచి వచ్చే ఏ రకమైన ముప్పునైనా తట్టుకుని తిప్పికొట్టేలా నింగి, నేల, సముద్ర మార్గాల ద్వారా ప్రయోగించే వ్యూహాత్మక వ్యవస్థలను భారత్ విజయవంతంగా సిద్ధం చేసుకుంది.


శాస్త్రవేత్తలు హాన్స్ ఎమ్ క్రిస్టెన్సెన్, మాట్ కోర్డా, ఎలియానా జాన్స్, మెక్కెంజీ నైట్-బోయిల్ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. భారత్ తన అణు సామర్థ్యంలో పారదర్శకతను కాపాడుకుంటూనే, స్వదేశీ పరిజ్ఞానంతో ఆయుధ సంపత్తిని బలోపేతం చేసుకుంటోంది. వైమానిక దళంలో మిరాజ్ 2000, జాగ్వార్ విమానాలు ప్రస్తుతం వ్యూహాత్మక అణు దాడులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రానున్న రోజుల్లో జాగ్వార్ స్థానంలో ఫ్రాన్స్ నుంచి పొందిన ‘రఫేల్’ యుద్ధ విమానాలు ఈ బాధ్యతను స్వీకరించనున్నాయని నివేదికలు పేర్కొన్నాయి.


క్షేత్రస్థాయి క్షిపణులు (Agni Series): రక్షణ పరిశోధన పురోగతి సంస్థ (DRDO) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ‘అగ్ని’ క్షిపణి శ్రేణి భారత వ్యూహాత్మక బలానికి వెన్నెముకగా నిలిచింది. పృథ్వి-II, అగ్ని-I (700 కి.మీ) నుంచి అగ్ని-IV (3,500 కి.మీ కంటే ఎక్కువ) వరకు ఆరు రకాల బాలిస్టిక్ క్షిపణులు పూర్తిస్థాయి వినియోగంలో ఉండగా, అధునాతన 'అగ్ని ప్రైమ్' త్వరలోనే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనుంది. సుమారు 5,000 కిలోమీటర్లకు పైగా పరిధి కలిగిన 'అగ్ని-V' క్షిపణితో భారత రక్షణ పరిధి ఊహించని స్థాయికి పెరిగింది.


దీని ద్వారా పాకిస్థాన్, చైనా దేశాలలోని ప్రతి మూలతో పాటు మధ్య ఆసియా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, యూరప్‌లోని కీలక ప్రాంతాలు భారత క్షిపణి పరిధిలోకి వస్తాయి. సరిహద్దులకు దూరంగా, సురక్షితమైన అంతర్భాగాల నుంచి ప్రయోగించినా శత్రు లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగలగడం దీని ప్రత్యేకత. ‘మొదట వినియోగించం’ (No First Use) అనే ప్రాథమిక సూత్రానికి కట్టుబడి ఉన్నప్పటికీ, సార్వభౌమాధికార రక్షణ విషయంలో భారత్ సాధించిన ఈ స్వయంసమృద్ధి శత్రుదేశాలకు బలమైన హెచ్చరికగా నిలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

నా ఇన్నింగ్స్ క్రెడిట్ ధోనికే దక్కుతుంది: విండీస్ కెప్టెన్ హోప్

పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్

అయోధ్య రామాలయం చందా చోరీ కేసు.. దర్యాప్తును త్వరగా ముగించేందుకు ఎందుకంత తొందర?

Updated Date - Oct 04 , 2026 | 06:03 PM