అయోధ్య రామాలయం చందా చోరీ కేసు.. దర్యాప్తును త్వరగా ముగించేందుకు ఎందుకంత తొందర?
ABN , Publish Date - Oct 04 , 2026 | 03:55 PM
అయోధ్య రామాలయం చందా చోరీ కేసు దర్యాప్తుపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తీవ్ర ప్రశ్నలు లేవనెత్తారు. 105 చోరీ ఘటనలు నమోదైనప్పటికీ కేవలం 8 మందిపై ఛార్జ్‌షీట్‌తో కేసు ముగించేందుకు ఎందుకు తొందరపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల (చందా) దొంగతనం వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ చందా చోరీ కేసు దర్యాప్తును 'త్వరగా ముగించేందుకు' ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన జైరాం రమేష్, దొంగలను కాపాడుతున్నారనే అనుమానం ఉన్న ప్రధాన వ్యక్తుల వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ ఎందుకు చేరుకోలేదని నిలదీశారు. ఈ విలక్షణ కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు.
జూన్ 4న దొంగతనానికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చి, జూన్ 5న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించినప్పటికీ.. జూన్ 25 వరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో 21 రోజుల ఆలస్యం ఎందుకు జరిగిందని జైరాం నిలదీశారు. ట్రస్ట్ అధికారులైన.. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, సభ్యుడు అనిల్ మిశ్రాలను నిందితులుగా విచారించకుండా.. కేవలం సాక్షులుగా ఎందుకు మార్చారని కూడా జైరాం రమేశ్ కేంద్రాన్ని అడిగారు.
సీసీటీవీల్లో 105 సార్లు చందాల చోరీ నమోదైనప్పటికీ, కేవలం 8 మంది చిన్న స్థాయి ఉద్యోగులపైనే చార్జ్‌షీట్ మోపి కేసు ముగించాలని ఎందుకు చూస్తున్నారు? వ్యవస్థలోని పెద్దల ప్రమేయం లేదా రక్షణ లేకుండా ఇది ఎలా సాధ్యమైందని జైరాం ప్రశ్నలు గుప్పించారు. 105 దొంగతనాల సంఘటనల నుంచి ఇప్పటివరకు కేవలం రూ. 79.85 లక్షలు మాత్రమే రికవరీ చేసి, కేసును క్లోజ్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు హడావుడి చేస్తోందని ప్రశ్నించారు. ఈ చందా చోరీ వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని కాంగ్రెస్ మొదటి నుంచీ డిమాండ్ చేస్తోందని జైరాం రమేష్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..