Share News

Supriya Sule: పవార్ వర్గాల విలీనంపై ఊహాగానాలు... సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 11 , 2026 | 09:10 PM

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీపై సుప్రియ సూలే విమర్శలు గుప్పించారు. కమలం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు బలం, కండబలం చూపించిందని ఆరోపించారు. ఇండియాను అవినీతి రహిత దేశంగా చేస్తామని ప్రధాని మోదీ చెబుతుంటే ఈ పరిణామం మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్నారు.

Supriya Sule: పవార్ వర్గాల విలీనంపై ఊహాగానాలు... సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు
Supriya Sule and Ajit Pawar

పుణె: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్‌ (Ajit Pawar) నాయకత్వంపై తనకు విశ్వాసం ఉందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుప్రియా సూలే (Supriya Sule) చెప్పారు. ఎన్‌సీపీ-ఎన్‌సీపీ ఎస్‌పీ వర్గాలు విలీనం కానున్నాయనే ఊహాగానాల నేపథ్యంలో ఆమె తాజా వ్యాఖ్యలు చేశారు. రెండు పార్టీల ఐడియాలజీ ఒకటేనని, అయితే రెండు చీలక వర్గాలు తిరిగి కలిసిపోనున్నాయనే ఊహాగానాల్లో నిజం లేదని చెప్పారు. విలీనం ప్రతిపాదన ఎవరి దగ్గర నుంచి రాలేదని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


చీలక వర్గాల విలీనానికి ఎన్‌సీపీ (ఎస్‌పీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఆమోదం తెలిపారని వస్తున్న కథనాలను సుప్రియ తోసిపుచ్చారు. తమ ఇంటిలో అలాంటి చర్చ ఏమీ జరగలేదని, ప్రస్తుతం తమ పార్టీ మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేసి గెలిచేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. అయితే పుణె, పింప్రి చించ్వాడ్‌లో మాత్రం ఎన్సీపీ వర్గాలు రెండూ అజిత్ పవార్ నాయకత్వంలో పోటీ చేస్తున్నట్టు తెలిపారు. 'విలీనంపై మేము ఆలోచించ లేదు. అలాంటి ప్రతిపాదన కూడా రాలేదు. కుటుంబం వేరు, రాజకీయాలు వేరు. కాలమే అన్ని గాయాలను మాన్పుతుంది. ఇప్పటికైతే రెండు మున్సిపల్ ఎన్నికల్లో మాత్రమే కలిసి పోటీ చేస్తున్నాం' అని సుప్రియ వివరించారు.


బీజేపీ, ఫడ్నవిస్‌పై మండిపాటు

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, బీజేపీపై సుప్రియ సూలే విమర్శలు గుప్పించారు. కమలం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు బలం, కండబలం చూపించిందని ఆరోపించారు. ఇండియాను అవినీతి రహిత దేశంగా చేస్తామని ప్రధాని మోదీ చెబుతుంటే ఈ పరిణామం మాత్రం ఇందుకు భిన్నంగా ఉందన్నారు. బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోపై అడిగినప్పుడు, రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలో ఉండి కూడా ముంబై రోడ్లపై గతుకులు లేకుండా చేయలేకపోయారని, అవిభక్త ఎన్‌సీపీ, కాంగ్రెస్ మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడు ముంబైలో హౌసింగ్ ఫెసిలిటీస్ కల్పించామని, తమ పథకాలన్నీ చక్కగా అమలయ్యాయని చెప్పారు. రోహింగ్యాలు, బంగ్లా అక్రమవలసదారుల నుంచి ముంబైకి విముక్తి కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీపై మాట్లాడుతూ ఆ పార్టీ దిశానిర్దేశం కోల్పోయిందని, వాస్తవ సమస్యలను ప్రస్తావించడం మానేసిందని అన్నారు. అటు కేంద్ర, ఇటు రాష్ట్రంలో హోం శాఖ బీజేపీ చేతిలోనే ఉందని, జాతీయ భద్రత, సరిహద్దు భద్రత కూడా ఆ పార్టీ చేతుల్లోనే ఉందని, అలాంటప్పుడు అక్రమవలసదారల సమస్యకు జవాబు చెప్పాల్సింది కూడా వాళ్లేనని అన్నారు.


ఇవి కూడా చదవండి..

వడ్డీలేని రుణాలు, బస్సుల్లో మహిళలకు రాయితీలు...మహాయుతి మేనిఫెస్టో

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్.. వైబ్రంట్ గుజరాత్‌ సదస్సులో మోదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 11 , 2026 | 09:17 PM