Amit Shah: శబరిమల బంగారం చోరీ వ్యవహారం.. పినరయి సర్కార్‌పై అమిత్‌షా నిప్పులు
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:35 PM
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను గెలుచుకుంది. ఈ విజయం అనంతరం తిరువనంతపురంలో అమిత్‌షా తొలిసారి పర్యటించారు.
తిరువనంతపురం: సంచలనం సృష్టించిన శబరిమల బంగారం చోరీ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) ప్రభుత్వంపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) విమర్శలు గుప్పించారు. బంగారం మాయం కావడానికి బాధ్యులైన వారికి ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ఈ కేసును స్వతంత్ర, తటస్థ విచారణ ఏజెన్సీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పినరయి విజయన్ ప్రభుత్వం హయాంలో నిజం బయటకు రాదన్నారు.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను గెలుచుకుంది. ఈ విజయం అనంతరం తిరువనంతపురంలో అమిత్‌షా తొలిసారి పర్యటించారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడటంతో పాటు పార్టీ మిషన్-2026 ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో అమిత్‌షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
శబరిమల అంశాన్ని ప్రస్తావిస్తూ, ఈ ఘటన కేవలం కేరళకే పరమితం కాదని, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులతో ముడిపడిన అంశమని చెప్పారు. కీలకమైన పుణ్యక్షేత్రంలోని విలువైన వస్తువులను కాపాడటంలో విఫలమైన ప్రభుత్వం ప్రజల మత విశ్వాసాలను ఎలా కాపాడుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులకు అనుకూలంగా ఎఫ్ఐఆర్ రూపొందించినట్టు కనిపిస్తోందన్నారు. ఎల్‌డీఎఫ్‌తో సంబంధం ఉన్న ఇద్దరు అనుమానితుల్లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నిష్పాక్షిక విచారణ ప్రశ్నార్థకమేనని అన్నారు.
తటస్థ ఏజెన్సీకి అప్పగించండి
శబరిమల బంగారం చోరీపై విచారణను తటస్థ విచారణ ఏజెన్సీకి అప్పగించాలని అమిత్‌షా డిమాండ్ చేశారు. ఈ విషయమై బీజేపీ ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తుందని, ప్రజల్లో చైతన్యం కలిగిస్తుందని చెప్పారు. 'ఇది ప్రజాస్వామ్యం. తటస్థ ఏజెన్సీకి కేసు దర్యాప్తును అప్పగించాలని సీఎంను నేను డిమాండ్ చేస్తున్నాను' అని అన్నారు.
కేరళ, బెంగాల్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
కేరళ, పశ్చిమబెంగాల్‌లో ఒకే సమయంలో ఎన్నికలు జరుగనున్నాయని, రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలను బీజేపీ ఏర్పాటు చేస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో బీజేపీ ఒక అడుగు ముందుకు వేసిందని, రాష్ట్రంలో బీజేపీ సీఎం ఏర్పడేంతవరకూ బీజేపీ ఆగేదిలేదని చెప్పారు. 2047 నాటికి అభివృద్ధి భారతదేశం మోదీ విజన్ అని, వికసిత్ కేరళతోనే వికసిత్ భారత్ సాధ్యమని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఆ శక్తులు ఇప్పటికీ చురుగ్గానే ఉన్నాయి.. ప్రధాని మోదీ
సోమనాథ్ శౌర్యయాత్రలో ప్రధాని.. కాన్వాయ్ వెంట 108 అశ్వాలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి