టీవీ చానెళ్లు ప్రసార కార్యక్రమాల్లో నియమావళి పాటించాలి.. కేంద్రం అడ్వైజరీ
ABN , Publish Date - Oct 21 , 2026 | 09:42 PM
ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ చానల్స్ తమ ప్రసార కార్యక్రమాల్లో కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం, నిబంధనల్లోని కార్యక్రమ నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ చానల్స్ తమ ప్రసార కార్యక్రమాల్లో కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ చట్టం, నిబంధనల్లోని కార్యక్రమ నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం చానెళ్లకు ఆ శాఖ ఒక అడ్వైజరీని జారీ చేసింది. అలాగే వార్తలు, గ్రాఫిక్స్, వర్చువల్ న్యూస్ ప్రజంటేషన్లు, ఇతర కార్యక్రమాల రూపకల్పనలో ఏఐ, జనరేటివ్ ఏఐ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వార్తల కచ్చితత్వం, విశ్వసనీయత, సున్నితత్వానికి భంగం కలగకుండా ఏఐ సాధనాలను సహాయక సాధనాలుగానే వినియోగించాలని స్పష్టం చేసింది.
వివిధ టెలివిజన్ చానళ్లు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం 1995, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ నిబంధనలు 1994లోని కార్యక్రమ నియమావళిని ఉల్లంఘించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కొన్నిచానళ్లలో ఒకే అంశానికి సంబంధించి సారూప్య వార్తలు ప్రసారమవుతున్నాయని పేర్కొంది. ఇటువంటి ప్రసారాలు కార్యక్రమ నియమావళి స్ఫూర్తికి అనుగుణంగా లేవని అభిప్రాయపడింది. ప్రసారాల్లో అనుచిత ప్రవర్తన, అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించరాదని, వాటిని సాధారణ అంశాలుగా చిత్రీకరించరాదని ఆ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. చర్చలు, ప్యానెల్ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతినిధులను జాగ్రత్తగా ఎంపిక చేయడంతో పాటు వారికి తగిన అవగాహన కల్పించాలని సూచించింది. మత సామరస్యానికి విఘాతం కలిగించే, దేశ వ్యతిరేక భావాలను ప్రోత్సహించే వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేసింది. అవమానకరమైన, అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రసారం కాకుండా చూడాలని, అవసరమైన సందర్భాల్లో ఆడియోను నిలిపివేయడం, హెచ్చరికల ప్రకటనలు ఇవ్వడం లేదా ప్రసారాన్ని నిలిపివేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
వాటిని ప్రత్యక్ష ప్రసారం చేయరాదు
ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల విషయంలో భద్రతా దళాలు చేపట్టే ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేయరాదని మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. ఆపరేషన్ ముగిసే వరకు అధికారికంగా నియమితులైన అధికారి ఇచ్చే సమాచారానికే వార్తా కవరేజీని పరిమితం చేయాలని సూచించింది. నేరాలు, హింసకు సంబంధించిన వార్తలను సెన్సేషనల్‌గా ప్రసారం చేయకుండా జాగ్రత్త వహించాలని, ప్రేక్షకులను ఇబ్బందికి గురిచేసే దృశ్యాల ప్రసారంలో సంయమనం పాటించాలని సూచించింది. ఇటువంటి దృశ్యాలను పదేపదే ప్రసారం చేయడం లేదా లూప్‌లో చూపించడం నివారించాలని స్పష్టం చేసింది. ప్రకృతి విపత్తులు, భారీ ప్రమాదాలపై వార్తలను ధ్రువీకరించిన సమాచారంతోనే ప్రసారం చేయాలని సూచించింది. దీనివల్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు వ్యాపించకుండా చూడవచ్చని పేర్కొంది. అలాగే భారతదేశ పటాల ప్రసారంలో సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన అధికారిక, ప్రామాణిక మ్యాపులను మాత్రమే వినియోగించాలని మంత్రిత్వ శాఖ తన అడ్వైజరీలో స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు అనుమతివ్వని పీసీబీ
ఆర్ఎస్ఎస్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి..