Share News

భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు అనుమతివ్వని పీసీబీ

ABN , Publish Date - Oct 21 , 2026 | 08:46 PM

భారత్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్‌ జట్టుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అనుమతి నిరాకరించింది.

భారత్‌లో ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు అనుమతివ్వని పీసీబీ
Pakistan Cricket Board

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్‌ జట్టుకు ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) అనుమతి నిరాకరించింది. 50 ఏళ్లు పైబడిన ఆటగాళ్లతో కూడిన పాకిస్థాన్‌ జట్టు ఈ టోర్నీలో ఆడేందుకు సిద్ధమైనప్పటికీ.. భారత్‌లో పర్యటించేందుకు అనుమతి లేదని పీసీబీ స్పష్టం చేసింది. దీంతో టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు పాకిస్థాన్‌ వెటరన్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.


గత ఏడాది శ్రీలంకలో జరిగిన ఈ టోర్నీలో పాకిస్థాన్‌ విజేతగా నిలిచింది. అయితే ఈసారి భారత్‌లో జరిగే పోటీలకు తమ జట్టు హాజరుకావడం లేదని నిర్వాహకులకు తెలియజేసినట్లు పాకిస్థాన్‌ వెటరన్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఫవాద్‌ ఇజాజ్‌ వెల్లడించాడు. తమ స్థానంలో మరో జట్టును ఎంపిక చేసుకునేందుకు నిర్వాహకులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు.


వీసాలు, భద్రతకు హామీ ఇచ్చినా..

భారత్‌లో జరిగే టోర్నీలో పాల్గొనేందుకు తమ ఆటగాళ్లకు వీసాలు మంజూరు చేయడంతో పాటు పటిష్ట భద్రత కల్పిస్తామని నిర్వాహకులు, ఆతిథ్య దేశం హామీ ఇచ్చినట్లు ఫవాద్‌ ఇజాజ్‌ తెలిపాడు. ఈ నేపథ్యంలో టోర్నీలో పాల్గొనేందుకు పీసీబీతో పాటు పాకిస్థాన్‌ విదేశాంగ, అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖల అనుమతి కోరినట్లు వివరించాడు. అయితే పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల మంత్రి, పీసీబీ అధ్యక్షుడు మొహ్సిన్‌ నఖ్వీ.. భారత్‌లో ఆడేందుకు అనుమతి లేదని తమకు తెలిపినట్లు వెల్లడించాడు. ఇటీవల భారత్‌లో జరగాల్సిన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్థాన్‌ నిరాకరించింది. దీంతో ఆ జట్టు స్థానంలో బంగ్లాదేశ్‌కు అవకాశం కల్పించారు.


ఇవి కూడా చదవండి:

మూడు ఫార్మాట్లలో ఆడుతా.. నాపై ఆ ముద్ర వేయకండి: ప్రియాంశ్ ఆర్య

ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి అమిత్ మిశ్రా.. గంగూలీ, యువీలతో పాటు..!

Updated Date - Oct 21 , 2026 | 08:46 PM