Share News

లారీ రూపంలో మృత్యువు.. తల్లీకుమారుడు మృతి!

ABN , Publish Date - Oct 21 , 2026 | 08:26 PM

జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజారీబాగ్‌ జిల్లాలో రోడ్డు దాటుతున్న మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడిని వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందగా, మరో ముగ్గురు పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.

లారీ రూపంలో మృత్యువు.. తల్లీకుమారుడు మృతి!
Jharkhand Road Accident

ఇంటర్నెట్ డెస్క్: జార్ఖండ్‌లోని హజారీబాగ్‌ జిల్లాలో బుధవారం ఘోరం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడు దుర్మరణం చెందారు. దుర్గాపూజ వేడుకల కోసం పుట్టింటికి వచ్చిన ఆ మహిళ, పండుగ ముగిశాక తిరిగి అత్తింటికి బయలుదేరిన వేళ ఘోర ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


బిహార్‌ రాష్ట్రం గయా జిల్లా బరచట్టి పీఎస్ పరిధిలోని కేవాలియా గ్రామంలో ఊర్మిళా దేవి (35),దినేష్ సింగ్ దంపతులు తమ నలుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఊర్మిళా ఇటీవలే దుర్గాపూజ కోసం తతి ఝరియాలోని ఖైరా-కర్మ గ్రామంలోని ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. పండుగ ముగిసిన అనంతరం ఇవాళ(బుధవారం) ఆమె పిల్లలతో కలిసి తిరిగి అత్తింటికి బయలుదేరారు.


ఈ క్రమంలో మార్గమధ్యలోని బర్హిచౌక్ వద్ద రోడ్డు దాటుతుండగా అతివేగంగా దూసుకొచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఊర్మిళా దేవితో పాటు ఆమె చిన్న కుమారుడు దీపాన్షు కుమార్ (4) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు పిల్లలు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఘటన స్థలంలో మృతదేహాలతో పాటు పిల్లల ఆటవస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటం స్థానికులను కలచివేసింది.


సమాచారం అందుకున్న బర్హి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఢిల్లీలో మళ్లీ పెరిగిన వాయు కాలుష్యం.. గ్రాప్‌-1 ఆంక్షలు అమల్లోకి..

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వార్షికోత్సవ వేడుకలు.. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి

కేంద్ర నిధులను అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

Updated Date - Oct 21 , 2026 | 08:30 PM