విమాన సర్వీసు రద్దు.. ప్రయాణికుడికి రూ.40 వేల పరిహారం
ABN , Publish Date - Oct 21 , 2026 | 07:02 PM
విమాన సర్వీసు రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న పట్టువస్త్రాల వ్యాపారికి రూ.40 వేల పరిహారం చెల్లించాలని బెంగళూరులోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ఓ ప్రైవేటు విమానయాన సంస్థను ఆదేశించింది. అయితే, సదరు విమాన సర్వీసు రద్దు వల్ల తాను ఒక వ్యాపార అవకాశాన్ని కోల్పోయానని, దాంతో తనకు రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని ఆ ప్రయాణికుడు పేర్కొన్నారు.
ఇంటర్‌నెట్ డెస్క్: విమాన సర్వీసు రద్దుతో ఇబ్బందులు ఎదుర్కొన్న పట్టువస్త్రాల వ్యాపారికి రూ.40 వేల పరిహారం చెల్లించాలని బెంగళూరులోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. ఓ ప్రైవేటు విమానయాన సంస్థను ఆదేశించింది. అయితే, సదరు విమాన సర్వీసు రద్దు వల్ల తాను ఒక వ్యాపార అవకాశాన్ని కోల్పోయానని, దాంతో తనకు రూ.3 లక్షల నష్టం వాటిల్లిందని ఆ ప్రయాణికుడు పేర్కొన్నారు. తన వాదనకు తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో ఆ మొత్తాన్ని చెల్లించాలన్న ప్రయాణికుడి అభ్యర్థనను కమిషన్ తిరస్కరించింది. బెంగళూరుకు చెందిన వి.దివాకర్ దాఖలు చేసిన ఫిర్యాదుపై మూడో అదనపు బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు కె. శివరామ్, మెంబర్ రేఖా సయ్యన్నవర్ గత నెల 25న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఢిల్లీ విమానం రద్దుతో ఇబ్బందులు
దివాకర్ నిరుడు డిసెంబరు 5న ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు అదే ఏడాది అక్టోబరు 15న రూ.8,095 చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాక తన విమానం రద్దయినట్లు తెలిసిందని ఆయన ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సదరు ఎయిర్‌లైన్స్ ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన ఆరోపించారు. దీంతో డిసెంబరు 7న బెంగళూరుకు వెళ్లేందుకు మరో విమాన టికెట్‌ను రూ.24,470 చెల్లించి కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. అలాగే, గురుగ్రామ్‌లో రెండు రోజులు ఉండటంతో హోటల్ ఖర్చుల కింద రూ.17,936 అయ్యాయని తెలిపారు. తాను పట్టు వస్త్రాలు, చీరల వ్యాపారం నిర్వహిస్తున్నానని, భారీ మొత్తంలో వస్త్రాల కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.8 లక్షల విలువైన లావాదేవీపై చర్చించేందుకు ఒక సమావేశానికి హాజరు కావాల్సి ఉండిందని ఆయన పేర్కొన్నారు. విమానం రద్దు కారణంగా ఆ సమావేశానికి వెళ్లలేకపోయానని, దీంతో తాను రూ.3 లక్షల విలువైన వ్యాపార అవకాశాన్ని కోల్పోయానని వివరించారు. వ్యాపారంలో నష్టం, మానసిక వేదన కింద పరిహారంతో పాటు అదనపు ప్రయాణ, హోటల్ ఖర్చులు చెల్లించాలని ఆయన కోరారు.
ఆధారాలు లేకపోవడంతో
సదరు విమానయాన సంస్థ ఆ ఆరోపణలను ఖండించింది. నిర్వహణాపరమైన కారణాలతోనే విమానాన్ని రద్దు చేశామని, ప్రయాణికుడికి వెంటనే సమాచారం అందించామని పేర్కొంది. టికెట్ రుసుము మొత్తాన్ని 2025 డిసెంబరు 8న ట్రావెల్ ఏజెంట్ ఖాతాకు తిరిగి చెల్లించామని కమిషన్‌కు తెలిపింది. హోటల్ బిల్లులు, భోజన రసీదులు లేదా ఇతర ఖర్చులకు సంబంధించిన పత్రాలను దివాకర్ సమర్పించలేదని కమిషన్ గుర్తించింది. అలాగే, వ్యాపార లావాదేవీకి సంబంధించిన ఖాతాలు, ఇన్‌వాయిస్‌లు, ఉత్తరప్రత్యుత్తరాలు వంటి ఆధారాలు కూడా అందుబాటులో లేవని పేర్కొంది. కేవలం వాదనల ఆధారంగా వ్యాపార నష్టాన్ని నిర్ధారించి పరిహారం మంజూరు చేయలేమని స్పష్టం చేసింది. అయితే, ప్రయాణికుడికి కలిగిన ఇబ్బందులు, ఎదుర్కొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రూ.30 వేల పరిహారం, రూ.10 వేల న్యాయపోరాట ఖర్చులు కలిపి మొత్తం రూ.40 వేలు చెల్లించాలని విమానయాన సంస్థను కమిషన్ ఆదేశించింది. ఉత్తర్వులు వెలువడిన 45 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేసింది. గడువులోగా చెల్లించకపోతే, మొత్తం సొమ్ముపై ఏటా 9 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఎగిరే కారు శాంపిల్ మాత్రమే.. ఎలాన్ మస్క్ ఏం ప్లాన్ చేశారంటే..?
టెస్లా రోడ్‌స్టర్ కారు గాల్లో ఎగరడం వెనుక అసలు రహస్యం ఏంటి?