ఫ్లైదుబాయ్ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:16 PM
ఫ్లైదుబాయ్ ఘటనపై విచారణ జరపాలని జాతీయ దర్యాప్తు సంస్థను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్‌ను ఎన్ఐఏ నమోదు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రకుట్రపై ఈరోజు (శనివారం) జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. యాంటీ-హైజాకింగ్ చట్టం-2016, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా) కింద కేసు నమోదు చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది.
సెప్టెంబర్ 30న యూఏఈలోని దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్‌అవీవ్‌కు ప్రయాణిస్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చేందుకు ఉగ్ర ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాన పైలట్ స్మిత్ మచ్చార్‌పై కో-పైలట్ అల్‌హమ్మామీ గొడ్డలితో దాడి చేశాడు. అయితే మచ్చార్ ప్రాణాలకు తెగించి ప్రయాణికులను రక్షించేందుకు ప్రయత్నించారు. ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్ల సహాయంతో విమానాన్ని సురక్షితంగా సౌదీ అరెబియాలో ల్యాండ్ చేశారు. ఆ తరువాత హమ్మామీని సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా ఈ ఘటనపై విచారణ జరపాలని జాతీయ దర్యాప్తు సంస్థను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్‌ను ఎన్ఐఏ నమోదు చేసింది. అయితే ఈ ఎఫ్ఐఆర్‌లో ఉగ్రదాడి వెనుక కారణాలను పేర్కొనలేదు. అలాగే హమ్మామీ మినహా ఇంకో వ్యక్తి పేరూ ప్రస్తావించలేదు. మరోవైపు ఫ్లైదుబాయ్ ప్రధాన ఫైలట్ స్మిత్ మచ్చార్ ఆరోగ్యం మెరుగవుతోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) తెలిపింది.
ఈ వార్తలూ చదవండి
సీజేపీ నిరసన అట్టర్ ఫ్లాప్.. బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర
రాహుల్ గాంధీతో విజయ్ భేటీ.. కేఫ్‌లో కాఫీ, తిరమిసు.. అభిమానులతో సెల్ఫీలు..