ఇస్లాంపై అభిప్రాయాలు చెప్పినందుకు దాడి చేశారు.. మాజీ ముస్లిం సాహిల్
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:39 PM
సామాజిక కార్యకర్త, పాపులర్ యూట్యూబర్ మాజీ ముస్లిం సాహిల్‌పై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ లో వెల్లడించారు. శనివారం రాత్రి ముంబైలో లైవ్ వీడియో చేస్తుండగా.. 12 మంది ముస్లింలతో కూడిన ఒక గుంపు తనపై దాడి చేసిందని ఆరోపించారు.
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక కార్యకర్త, పాపులర్ యూట్యూబర్ మాజీ ముస్లిం సాహిల్‌పై దాడి జరిగింది. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ లో వెల్లడించారు. శనివారం రాత్రి ముంబైలో లైవ్ వీడియో చేస్తుండగా.. 12 మంది ముస్లింలతో కూడిన ఒక గుంపు తనపై దాడి చేసిందని ఆరోపించారు. తాను తప్పించుకున్నానని, లేకపోతే తనను చంపేసి ఉండేవారని పేర్కొన్నారు. ‘నా స్నేహితులతో కలిసి శనివారం రాత్రి వాశిలో ఒక చోటకు వెళ్లాను. అక్కడ నేను లైవ్ వీడియో చేస్తుండగా.. కొంతమంది ముస్లింలు వచ్చి నాపై దాడి చేశారు. వాస్తవానికి వారు నన్ను చంపాలనుకున్నారు. ఆ టైంలో నేను నిరాయుధుడినై ఉన్నాను’ అని సాహిల్ తెలిపారు. ఇస్లాంపై అభిప్రాయాలు చెప్పినందుకే తనపై దాడి చేశారని ఆయన ఆరోపించారు.
సాహిల్ ముఖం, చేతులపై గాయాలతో కనిపించిన ఆ వీడియో వైరల్‌గా మారింది. ముంబైలోనూ, దేశంలోని మిగతా చోట్లా మాజీ ముస్లింలు సురక్షితంగా లేరని సాహిల్ అన్నారు. ఇదే ఇస్లాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా.. మాజీ ముస్లిం కార్యకర్తల్లో సాహిల్ ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. గత ఆరేళ్లుగా ఇస్లాంకు వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారు. ఇస్లాం ఆచారాలకు ఆయన వ్యతిరేకంగా గళం ఎత్తుతున్నారు. సాహిల్ సోషల్ మీడియా హ్యాండిల్స్, యూట్యూబ్ చానెల్స్‌కు వేల సంఖ్యలో ఫాలోవర్లు, 2.75 లక్షల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అలాగే యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటారు.
ఎవరీ సాహిల్?
ముంబైలోని ధారావి ప్రాంతంలో ఒక సంప్రదాయ ముస్లిం కుటుంబంలో సాహిల్ పెరిగారు. గతంలో ఆయన తబ్లీఘీ జమాత్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆయా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇస్లాం మత ప్రచారం చేసేవారు. 2020 కరోనా లాక్‌డౌన్ సమయంలో ఖురాన్, హదీసులను అధ్యయనం చేసిన తర్వాత తనకు దేవుడు, మత బోధనలపై సందేహాలు మొదలయ్యాయని ఆయన తెలిపారు. మత పండితుల నుంచి సరైన సమాధానాలు లభించకపోవడంతో ఆయన ఇస్లాం మతాన్ని వీడి నాస్తికుడిగా మారారు.
ఈ వార్తలు చదవండి
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. పుణే విమానాశ్రయంలో తప్పిన పెను ప్రమాదం
రామ్‌లీలా మైదానంలో ఇకపై 50 వేల మందికే అనుమతి