Share News

ఢిల్లీలో ఫ్యామిలీ హెరాయిన్ నెట్‌వర్క్.. రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ఆరుగురి అరెస్ట్

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:48 PM

ఢిల్లీలో ఒకే కుటుంబం నడిపుతున్న భారీ హెరాయిన్ నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. రూ.5 కోట్ల విలువైన 2.25 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేశారు. కొత్త ఏఎన్‌టీఎఫ్ స్టేషన్‌లో మొదటి కేసు ఇదే కావడం విశేషం.

ఢిల్లీలో ఫ్యామిలీ హెరాయిన్ నెట్‌వర్క్.. రూ.5 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం, ఆరుగురి అరెస్ట్
Delhi heroin network family arrest

ఢిల్లీ, నవంబర్ 15: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ (NCR) ప్రాంతాల్లో ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు నిర్వహిస్తున్న భారీ హెరాయిన్ సరఫరా ముఠాను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ-నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ANTF) ఛేదించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ. 5 కోట్ల విలువ చేసే 2 కిలోల 250 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెప్టెంబర్ 10, 2026న కొత్తగా ఏర్పాటైన ఏఎన్‌టీఎఫ్ (ANTF) పోలీస్ స్టేషన్‌లో నమోదైన మొట్టమొదటి కేసు ఇదే కావడం విశేషం.

పక్కా సమాచారంతో సబ్-ఇన్‌స్పెక్టర్ విపిన్ రాఠీ నేతృత్వంలోని బృందం సెప్టెంబర్ 11 తెల్లవారుజామున సిగ్నేచర్ బ్రిడ్జి–ఖజూరీ ఖాస్ సమీపంలో రెండు బైక్‌లను అడ్డగించింది. రాజౌరీ గార్డెన్‌కు చెందిన రోహిత్ దివాకర్, అతని భార్య, సోదరుడు విశాల్ దివాకర్‌లను అదుపులోకి తీసుకున్నారు. విశాల్ వద్ద ఉన్న బ్యాక్‌ప్యాక్ నుంచి 2 కిలోల 6 గ్రాముల హెరాయిన్‌తో పాటు రెండు బైక్‌లను స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసు నమోదు చేశారు.

వీరిచ్చిన సమాచారంతో సెప్టెంబర్ 15న ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో దిల్షాద్ గార్డెన్‌కు చెందిన అఫ్రోజ్ అలీని అరెస్ట్ చేశారు. ఘజియాబాద్ షాలిమార్ గార్డెన్‌లోని అతని ఫ్లాట్ నుంచి మరో 104 గ్రాముల హెరాయిన్ రికవరీ చేశారు.

సెప్టెంబర్ 25న బురారీలో ఖయాలాకు చెందిన 23 ఏళ్ల చిరాగ్‌ను పట్టుకున్నారు. బాత్రూంలో దాచిన 140 గ్రాముల హెరాయిన్, రూ. 37,400 నగదు, ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. భార్య అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన చిరాగ్, మళ్లీ డ్రగ్స్ దందా మొదలుపెట్టినట్లు తేలింది.

నవంబర్ 10న ఘజియాబాద్‌లో ఆరో నిందితుడు గౌరవ్‌ను అరెస్ట్ చేసి, రూ. 36,000 నగదు, డ్రగ్స్ సొమ్ముతో కొనుగోలు చేసిన మహీంద్రా థార్ వాహనాన్ని సీజ్ చేశారు. ఇతనిపై గతంలోనే 5 కేసులు ఉన్నాయి.

ఈ ముఠా సభ్యులందరికీ లోతైన కుటుంబ సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. అఫ్రోజ్ అలీ, ఇతర డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న విక్కీకి సోదరుడు, ఇమ్రాన్‌కు మేనమామ అని పోలీసులు గుర్తించారు. అలాగే రోహిత్ భార్య తల్లి, సోదరి కూడా గతంలో నమోదైన డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. సెప్టెంబర్ 11న పట్టుబడిన ముగ్గురిపై గతంలో నేర చరిత్ర లేనప్పటికీ, వారి కుటుంబం మొత్తం ఈ అక్రమ వ్యాపారంలో కూరుకుపోయిందని వెల్లడైంది. (Delhi heroin network family arrest)


ఈ వార్తలూ చదవండి

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం

Updated Date - Nov 15 , 2026 | 03:48 PM