సీఎం సభలో మాట్లాడనివ్వలేదని మైక్ విసిరి కొట్టి, పోడియం పడేసిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Nov 15 , 2026 | 04:19 PM
ఉత్తరాఖండ్ పితోరాగఢ్‌లో జౌల్జీబీ జాతరలో సీఎం సమక్షంలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి మైక్ విసిరికొట్టి పోడియం పడేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆంధ్రజ్యోతి, నవంబర్ 15: ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలో శనివారం నిర్వహించిన ప్రతిష్ఠాత్మక జౌల్జీబీ జాతరలో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. వేదికపై మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ధార్చుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి మైక్‌ను విసిరికొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది.
శనివారం జౌల్జీబీ జాతరకు ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కార్యక్రమాన్ని ప్రారంభించి, కొంత సమయం తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం వెళ్లిపోయిన వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి తన మద్దతుదారులతో కలిసి వేదికపైకి చేరుకుని గందరగోళం సృష్టించారు.
జాతరకు అధ్యక్షుడిగా ఉన్న తనకు ముఖ్యమంత్రి సమక్షంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాతైనా మాట్లాడేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు మైక్‌ను ఆపేశారని ఆరోపిస్తూ, ఆగ్రహంతో మైక్‌ను విసిరికొట్టారు. అంతటితో ఆగకుండా వేదికపై ఉన్న పోడియాన్ని, కుర్చీలను కింద పడేసి రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎం పుష్కర్ సింగ్ ధామిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్యే హరీశ్ సింగ్ ధామి వేదికపై రసాభాస సృష్టించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి బహిరంగ వేదికపై ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటని BJP నేతలు మండిపడ్డారు. (Congress MLA Ruckus at Jauljibi Jatara)